Telangana State Anthem :తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా రాష్ట్ర కేబినెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
CM Revanth Tweet Today : సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ (TS) బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ (TG) అక్షరాలనే తీసుకురావాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ - బడ్జెట్ సమావేశాల తేదీలు, గ్యారంటీల అమలుపై చర్చ
గతంలో రాష్ట్ర గీతం ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ :తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఓసారి ప్రస్తావన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాఠశాలల్లో జయ జయహే తెలంగాణ గీతాన్ని విద్యార్థులు ఆలపిస్తున్నారని, కానీ దీన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం రోజున రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.