తెలంగాణ

telangana

ETV Bharat / state

నోటీసులిచ్చి 24 గంటలు గడవలేదు, వారి వివరణ తీసుకోలేదు - హైడ్రా కూల్చివేతలపై​ హైకోర్టు ఆగ్రహం - HIGH COURT SERIOUS ON HYDRA

హైడ్రాపై హైకోర్టు సీరియస్​ - 24 గంటలు గడవక ముందే ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం - ఇలాగైతే హైడ్రా కమిషనర్​ మళ్లీ కోర్టుకు రావాల్సి ఉంటుందన్న హైకోర్టు

High Court Serious on HYDRA
High Court Serious on HYDRA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 7:00 AM IST

High Court Serious on HYDRA :హైదరాబాద్​ ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. హైడ్రా కమిషనర్​కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారని, ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలో చెరువు ఎఫ్‌టీఎల్‌ ప్రాంతమంటూ నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ మేకల అంజయ్య తదితరులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిన్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.

శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నెం 18/ఇ లో 12,640 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్​ పిటిషన్​లో తెలిపారు. హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తరువాతనే చర్యలు చేపట్టారనీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి అనుమతుల్లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారనీ జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.

నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా 24 గంటలే సమయం ఇస్తారా అంటూ హైకోర్టు నిలదీసింది. నోటీసులు జారీ చేసి కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్ వివరణ తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాకుండా అనుమతుల్లేకుండా పిటిషనర్లు కాంపౌండ్‌తో సహా ఇతర నిర్మాణాలు ఏమైనా చేపడితే జీహెచ్ఎంసీ కూల్చివేయవచ్చంటూ పిటిషన్‌పై విచారణను ముగించారు.

అసలేం జరిగింది : గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్​లో తొమ్మిది ఎకరాలు, ఏడు గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీంతో రెండు చెరువుల ఆక్రమణలు తొలగించి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20కి పైగా దరఖాస్తులను పరిశీలించి అధికారులు నిర్మాణాలను తొలగించారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. నోటీసులు ఇచ్చి 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తంగా, హైకోర్టులో లంచ్​మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు.

మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు - గచ్చిబౌలిలో నిర్మాణాలు నేలమట్టం

'అధికారికమైనా, అనధికారికమైనా గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు - ఆ భవనాలను మాత్రం వదలం'

ABOUT THE AUTHOR

...view details