Telangana High Court on Anurag University :ఎఫ్టీఎల్(FTL), బఫర్ జోన్ల ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్శిటీ, నీలిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 17.21 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2002లో అనురాగ్ గ్రూప్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, అలాగే అనురాగ్ ప్రైవేట్ యూనివర్శిటీని నడుపుతున్నారన్నారు.
2016లో నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసీ(NOC) తీసుకుని తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎంఏ(HDMA) సర్వే నంబరు 813 నివాస ప్రాంతంగా హద్దులు ప్రకటించిందని వివరించారు. యూనివర్శిటీకి చెందిన ఆరున్నర ఎకరాలు బఫర్‌జోన్‌లో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో 2017 నవంబరులో నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించారన్నారు. సర్వే నెం 813లో చెరువుకు సంబంధించిన స్థలం లేదని నివేదిక ఇచ్చారన్నారు.
ఈ నివేదిక ఆధారంగా రంగారెడ్డి కలెక్టర్ 2017లో ఎన్ఓసీ జారీ చేసినట్లు వివరించారు. అయితే ఈనెల 22న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అధికారులతో కలిసి అనుమతిలేకుండా యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చి తనిఖీలు నిర్వహించారన్నారు. నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన నిర్మాణాలు అందులో ఉన్నాయని పేర్కొన్నారన్నారు. దీని ఆధారంగా అసిస్టెంట్ ఇంజినీర్ పోచారం ఐటీ సెక్టార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చిసే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం ఇక్కడ హాస్టల్ ఉందని ఇందులో 150 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టామని, రాజకీయ దురుద్దేశాలతో చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.