Telangana High Court Comments on Land Registrations Issues :స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మొత్తం రెవెన్యూ వ్యవస్థలోనే లోపం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవిత కాల కష్టార్జితంతో 100,200 గజాల విస్తీర్ణంలో స్థలాన్ని కొనుగోలు కోసం వెళ్తే రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, జీఎస్టీ, కోర్టు ఖర్చులు, న్యాయవాదుల ఫీజుల వంటి అదనపు భారాలు పడుతున్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్లు అర్థం చేసుకోకుండా ముగిసిన వివాదాలపైనా తాజా కోర్టు ఉత్తర్వులు తేవాలని చెబుతుండటం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందని తెలిపింది. అలాగే కోర్టులో వందల పిటిషన్లు దాఖలై పెండెన్సీ భారం పడుతోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
నిషేధ ఉత్తర్వులు లేకున్నా పెద్ద అంబర్‌పేట పరిధిలో సర్వే నంబర్ 256లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రామేశ్వరిదేవి దాఖలు చేసిన 23 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలని సబ్‌రిజిస్ట్రార్‌ను నిలదీసింది. రిజిస్ట్రేషన్ ఎందుకు తిరస్కరించారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇలాంటి కారణాలపై ప్రజలు మళ్లీ కోర్టుకు రాకూడదని, కేసులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రాష్ట్రానికి వర్తించేలా తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
వారి వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించడం రాజ్యాంగ విరుద్ధం : అలాగే మరోవైపు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ నిబంధనను రద్దు చేయాలంటూ సుపరిపాలన వేదిక కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగా మంత్రులు కూడా పన్ను చెల్లించాలన్నారు. సీఎం, మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంకు ఉన్న సలహాదారులు, ఛైర్పర్సన్లు, పార్లమెంటు కార్యదర్శులకూ ప్రభుత్వమే పన్ను చెల్లించేలా 2015లో జీవో 917 తీసుకువచ్చిందని అన్నారు.