Body Pain Reason in Telugu: మనలో చాలా మంది తరచూ ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. దీంతో ఏ పనీ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటుుంటారు. ఫలితంగా ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. అయితే, వీటిని వాడడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ముఖ్యంగా కాలేయం పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018లో Journal of Clinical and Translational Hepatology (JCTH) ప్రచురితమైన "Acetaminophen-Induced Liver Injury: Mechanisms and Clinical Implications" అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ నేపథ్యంలోనే అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం మేలని సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డీ లోపం: మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎముకలు, దంతాలు బలంగా ఉండడానికి విటమిన్ డీ చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇది లోపిస్తే ఒళ్లు నొప్పులు వస్తాయని వివరిస్తున్నారు.
6-8 గంటల నిద్ర: ప్రతి మనిషికి సుమారు 6-8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోతున్నప్పుడు శరీరం శక్తి వనరుల్ని పునరుత్పత్తి చేసుకుంటుందని వివరిస్తున్నారు. ఒక వేళ సరిగ్గా నిద్ర లేకపోతే శరీరం శక్తి వనరుల్ని భర్తీ చేసుకోలేదని.. ఫలితంగా ఒళ్లు నొప్పులు వస్తాయని అంటున్నారు.
నీరు ఎక్కువగా తాగడం: శరీరంలో సరైన మోతాదులో నీరు లేకపోవడం వల్ల కూడా ఒళ్లు నొప్పులకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోతే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అలసట, శరీరమంతా నొప్పులు వేధిస్తాయని చెబుతున్నారు.
ఐరన్ లోపం: ఇంకా రక్తంలో కీలకమైన ఐరన్ లోపించడం వల్ల కూడా ఒళ్లు నొప్పులు వస్తాయని చెబుతున్నారు. ఇది లోపిస్తే శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ సక్రమంగా అందవని.. ఫలితంగా అలసట, ఒళ్లు నొప్పులు వస్తాయని అంటున్నారు.
కీళ్ల వాపు: కీళ్ల వాపు సమస్యల వల్ల ఒళ్లంతా నొప్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా కీళ్ల వాపును తగ్గించుకుంటే.. ఈ నొప్పులు కూడా తగ్గుతాయని అంటున్నారు.
ఇన్ఫెక్షన్లు: చలి, వానకాలాల్లో జలుబు, ఫ్లూ సమస్యలు సాధారణంగానే వస్తుంటాయి. అయితే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా విపరీతంగా ఒళ్లు నొప్పులు వస్తాయని అంటున్నారు.
ఒత్తిడి, ఆందోళన: మనలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే మానసికంగానే కాకుండా.. శారీరకంగా లసిపోతామని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రోగ నిరోధక శక్తి కూడా తగ్గి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి.. శరీర నొప్పులకు కారణం అవుతాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గాల్ బ్లాడర్లో రాళ్లతో ఇబ్బందులా? ఆపరేషన్ లేకుండానే ఈజీగా కరిగించుకోవచ్చట!
చలికాలంలో గర్భిణీలు ఇవి తప్పక పాటించాలట! లేకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమేనట!