Postpartum Depression : మాతృత్వం ఒక వరం. అదేంటో చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత కుంగుబాటుకు(పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) లోనవుతుంటారు. అయితే, ఈ సమస్య చాలా వరకు ఐదారు నెలల్లో తగ్గిపోతుంది. కానీ, కొందరు మహిళల్లో ఏళ్ల తరబడి కొనసాగుతుంది. అసలు, "పోస్ట్‌పార్టమ్ డ్రిపెషన్" అంటే ఏమిటి? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కాన్పు సమయంలో, ఆ తర్వాతా తల్లి శరీరం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లన్నీ ఉన్నట్టుండి తగ్గిపోతుంటాయి. అలాగే కాన్పు నొప్పులు, నిద్ర సరిగా పట్టకపోవటం, సరిగా తినకపోవటం, బిడ్డకు పాలు పట్టటం, మరోవైపు ఇంటికి వచ్చీ పోయేవారు ఇలాంటివన్నీ తల్లి భావోద్వేగాలు, మానసిక ధోరణి మీద చాలా ప్రభావం చూపుతాయంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ అనిత.
అదేవిధంగా, కొంతమంది చిరాకు పడటం, కోపం, ఏడ్వటం, నిద్ర పట్టకపోవటం, అంతలోనే కోపం, మరుక్షణంలో సంతోషం వంటి మానసిక ధోరణిని కనబరుస్తుంటారు. వీటినే పోస్ట్‌పార్టమ్/బేబీ బ్లూస్ అంటారని చెబుతున్నారు. అయితే, ఇవేమంత సమస్యాత్మకం కావు. కొన్ని రోజుల్లో వాటంతటవే తగ్గుతాయి. కానీ, కొందరు కుంగుబాటు(డిప్రెషన్) అనే మానసిక సమస్యకు లోనవుతుంటారు. దిగులు, నిరాశకు గురవుతుంటారు. ఇలా కాన్పు తర్వాత దిగులు తీవ్రమై కుంగుబాటుకు దారితీయడాన్నే "పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్" అంటారంటున్నారు డాక్టర్ అనిత.
డెలివరీ తర్వాత పొట్ట తగ్గట్లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా పోతుందట!
నిర్లక్ష్యం చేస్తే తల్లీబిడ్డకూ చేటు!
కొందరైతే జీవితం మీద విరక్తి చూపటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, ఎవరు ఎంత నచ్చజెప్పినా తమ ధోరణిలోనే ఉండిపోవటం చేస్తుంటారు. అంతేకాదు తాను, బిడ్డ ఎందుకు బతకాలనీ భావిస్తుంటారు. వాస్తవానికి ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నా చాలామంది తల్లులు ఎంతోకొంత సంతోషంతో ఉంటారు. కానీ, కుంగుబాటు గలవారికి అసలు సంతోషమనేదే ఉండదంటున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ అనిత. పైగా తమను తాము నిందించుకుంటారని చెబుతున్నారు. అంతా ఆనందంగా ఉంటుంటే తానెందుకు విచారిస్తున్నాననీ లోలోప మదన చెందుతుంటారు.
ఇది తీవ్రమైతే మనస్తాప రుగ్మత (సైకోసిస్)కూ దారి తీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. తననెవరో పిలుస్తున్నారనో, తనకేవో మాటలు వినిపిస్తున్నాయనో, ఎవరో తననే చూస్తున్నారనో, తానంటే ఎవరికీ ఇష్టం లేదనో ఇలా రకరకాల భ్రమలకు, భ్రాంతులకు లోనవుతుంటారని చెబుతున్నారు. అంతేకాకుండా, కుంగుబాటు తీవ్రమైతే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుందట. అలాగే, బిడ్డకు హాని తలపెట్టాలనీ ప్రయత్నిస్తుంటారంటున్నారు. కాబట్టి, కోలుకునేంతవరకు తల్లిని, బిడ్డను నిరంతరం ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
ఇలా చేయాలి!
ముఖ్యంగా ఆమెలో కనిపించే ఆయా లక్షణాలను పరిశీలించి కుంగుబాటా? మనస్తాపమా? అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత మానసిక నిపుణులను సంప్రదిస్తే జబ్బును నిర్ధరించి, తగు చికిత్స చేస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్ మందులు సూచిస్తారని చెబుతున్నారు. అయితే, కొన్ని మందులు చనుబాలలో కలిసే అవకాశముండటం వల్ల జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కొన్నిసార్లు కౌన్సెలింగ్‌తోనూ ఉపశమనం కలగొచ్చని సూచిస్తున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ అనిత.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లోనూ పోస్ట్‌పార్టమ్ డ్రిపెషన్‌ను వీలైనంత త్వరగా గుర్తించి తగిన చికిత్స అందించడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ప్రెగ్నెన్సీ తర్వాత నడుం నొప్పి వేధిస్తోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!