Phone Tapping On High Court Judges : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరువక ముందే ఇద్దరు హైకోర్టు జడ్జిలపైనా నిఘా ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ మహిళా జడ్జి సైతం ఉండగా వారిద్దరికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇద్దరు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ : ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌లో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ముఠాలోని ఓ కీలక నిందితుడి ఫోన్ విశ్లేషణలో న్యాయమూర్తుల ప్రొఫైళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ యంత్రాంగం ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వందలాది ప్రొఫైళ్లు బయటపడ్డాయి. అందులో ఇద్దరు జడ్జిల చిత్రాలతో పాటు వారి పుట్టు పూర్వోత్తరాలు సహా, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరచి ఉన్నాయి. ఒక జడ్జి ప్రొఫైల్‌పై ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాక్‌గ్రౌండ్ అని నిందితులు రాసిపెట్టుకున్నట్లు సమాచారం.
ఫోన్ నెంబర్లపై నిఘా : నిందితులు రూపొందించిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఫోన్ నెంబర్ల సీడీఆర్‌తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ ఐపీడీఆర్‌లను సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ఫోన్లకు సంబంధించిన వాయిస్ కాల్స్, మెసేజ్‌లతో పాటు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, ఛాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్స్, తదితర వివరాలను తెలుసుకోవడంపై ఈ ముఠా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్లు : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ అదనపు ఎస్పీ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో కీలక నేతలు, హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ప్రొఫైల్‌ను రూపొందించి వారి చరవాణులపై సుదీర్ఘకాలం నిఘా ఉంచినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనర్ గతేడాది జులైలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఫోన్ నిఘాపై దర్యాప్తు : ఆ రెండు నెంబర్లకు సంబంధించి 2022 సెప్టెంబర్ 10 నుంచి 2023 సెప్టెంబర్ 9 వరకు సీడీఆర్, 2023 ఆగస్టు 8 నుంచి 2023 సెప్టెంబర్ 7 వరకు ఐపీడీఆర్ వివరాలను సేకరించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఓ మహిళా న్యాయమూర్తి సహా ఇద్దరు జడ్జిలపై నిఘా ఎందుకు ఉంచారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి.
'ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు' : తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ - త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్!