Indiramma Household Survey : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికలో భాగంగా యాప్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అయితే సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువగా పెంకుటిళ్లలో ఉంటున్న దరఖాస్తుదారులే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఆయా దరఖాస్తుదారుల ఇంటికి సర్వేయర్లు వెళ్తుండగా ఇప్పటివరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేశారు. ఇందులో సుమారు 9.19 లక్షల మందికి సొంత స్థలాలున్నట్లు గుర్తించారు. అయితే వారిలో దాదాపు 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో ఉంటున్నారు.
2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో, 1.86 లక్షల మంది జీఐ రేకుల ఇళ్లలో ఉంటున్నారు. శ్లాబ్ గృహాల్లో 1.22 లక్షల మంది నివాసం ఉంటున్నారు. 69,182 మంది మట్టి మిద్దెల్లో, ప్లాస్టిక్ కవర్లు/టార్పాలిన్లతో కప్పిన ఇళ్లలో 41,971 మంది ఉంటున్నారు. ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో 34,576 మంది ఉంటుండగా 12,765 మంది పెంకులు పగిలిపోవడంతో టార్పాలిన్ కవర్లు కప్పిన ఇళ్లలో ఉంటున్నట్లు వెల్లడైంది. తొలి దశలో సొంతస్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిళ్లు, గుడిసెళ్లు, మట్టిమిద్దెలో ఉంటున్న దరఖాస్తుదారులకు.. అందులోనూ దివ్యాంగులు, వితంతువులను ప్రాధాన్యక్రమంలో గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో 59 శాతం పూర్తి : రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుండడంతో పట్టణాల్లో, గ్రామాల్లో అందరి చూపు యాప్ సర్వేపైనే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సంక్రాంతిలోపు 100% పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్వేయర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కానీ కొన్ని జిల్లాల్లో వేగంగా మరికొన్ని జిల్లాల్లో నత్తనడకగా సర్వే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 39% పూర్తి కాగా ఎక్కువగా మహబూబాబాద్ జిల్లాలో 59% పూర్తయింది. జనగామ, జగిత్యాల యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో 58% ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరిగింది. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 30 శాతంలోపే యాప్‌లో లభ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే అతి తక్కువగా జీహెచ్‌ఎంసీలో 7% మాత్రమే జరిగింది. నగరంలోని ప్రజాపాలన దరఖాస్తులు 10.70 లక్షలు రాగా ఇప్పటివరకు 74,380 మంది దరఖాస్తుదారుల ఇళ్లల్లో సర్వేయర్లు సర్వే చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు పీడీలను నియమించింది. వీరంతా నెమ్మదిగా సర్వే సాగుతున్న జిల్లాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రామసభలు, లబ్ధిదారుల ఎంపికపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల 'సర్వే'త్రా.. సాంకే'తికమక' - సిగ్నల్, సర్వర్ సమస్యలతో సర్వేయర్లకు ఇక్కట్లు
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పథకం కింద లబ్ధి పొందితే ఇల్లు రాదట