SDRF Funds To Telangana For Flood Affected Areas : రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి టెలిఫోన్ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందినట్లు పేర్కొంది.
కేంద్ర హోంశాఖ లేఖ : రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఐతే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది.