Irrigation Projects in Telangana : నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని నిర్ణయించిన తెలంగాణప్రభుత్వం, ఏటా కొత్తగా 6లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాలని భావిస్తోంది. అందుకోసం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో ఎంచుకొంది. గోదావరి బేసిన్‌లో 6, కృష్ణా బేసిన్ 6 ప్రాజెక్టులు ఉన్నాయి.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులు : మొదటి ఏడాది 75 శాతానికి పైగా పనులు పూర్తయి కొద్దిపాటి వ్యయంతో మిగితావి పూర్తిచేసి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తిచేయడం ద్వారా 45,738 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందుకు 184 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొడికుంటవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి 163 కోట్లు అవసరం కానున్నాయి. చనాకా-కొరాటా సహా లోయర్ పెన్ గంగ ప్రాజెక్టులపై 147కోట్ల ఖర్చు చేసి 50వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇప్పటికే 54 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ, 546 కోట్లతో మిగిలిన పనులు పూర్తిచేసి మరో 41 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేవాదులలో 512 కోట్లతో మిగితా పనులు పూర్తిచేసి మరో లక్షా 32వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ఏడాది 7115 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు లక్షా 11 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం 1487 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు : 6 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 ఉన్నాయి. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులు పూర్తి చేయటం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోయిల్‌సాగర్ ద్వారా మరో 3078 ఎకరాలు, భీమా కింద 21 వేల ఎకరాలు, నెట్టెంపాడు కింద 35 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.