Family Try To Die In Front Of The Siddipet Municipal Office : తమ ఇంటిని అకారణంగా కూల్చారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం డీజిల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
సిద్దిపేట పట్టణంలోని 12వార్డ్ కాళ్లకుంట కాలనీకి చెందిన పస్పునూరి నిర్మల కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే గురువారం సిద్దిపేట మున్సిపల్ అధికారులు వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి గోడను కూల్చి వేశారు. ఇదే విషయమై బాధితులు పస్పునూరి నిర్మల, చంద్రం, స్వామి కీర్తన, పూర్ణ చంద్ర తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇంటిని ఎలా కూలుస్తారని మున్సిపల్ కార్యాలయం ఎదుట డీజిల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
న్యాయం జరిగే వరకూ పోరాడతాం : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజిల్ పోసుకున్న వారిపై నీరు పోసి రక్షించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తమ ఇంటిని మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ ఇంటి గోడను కూల్చి వేయించారని ఆరోపించారు. ఆయనకు ఇప్పటికే లక్ష రూపాయల డబ్బులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు కూల్చారని, ఇది మూడోసారి ఇంటి గోడను కూల్చడమని వాపోయారు. తాము ఇప్పటికీ ఇంటికి పన్నులు కడుతున్నామని అయినా కూల్చడం ఏంటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు.
కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ని భర్తరఫ్ చేయాలి : విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్తూ ఇమామ్ మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ని వెంటనే భర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇదే విషయమై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడించారు.
"మున్సిపల్ బండి వచ్చింది. అప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మూడోసారి కూలుస్తున్నారని అడుగుతుంటేనే ఇంటి గోడను కూల్చేశారు."- పస్పునూరి నిర్మల, బాధితురాలు
హైడ్రా ఎఫెక్ట్ - ఒక్క ప్రహరీ గోడ కూల్చివేతతో 20 కాలనీలకు తొలగిన ఇబ్బంది