Ashta Lakshmi Significance : హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అంటారు. అయితే ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. జీవితంలో మనకు సంతోషం కలిగించేది ఏదైనా అది ఐశ్వర్యమే! ఒక్కో ఐశ్వర్యానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇందుకు తగినట్లుగానే లక్ష్మీదేవి కూడా అవతారాలు స్వీకరించింది. ఈ కథనంలో శ్రీ మహాలక్ష్మి అష్ట అవతారాలను వాటి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం.
జగజ్జనని శ్రీ మహాలక్ష్మీ
భక్తాభీష్ట ప్రదాయిని, వరప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తును పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఏ రకంగా జగత్ కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన శ్రీలక్ష్మీదేవి అష్ట అవతారాలు కూడా లోక కల్యాణానికి హేతువులే! విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణంలో కూడా శ్రీలక్ష్మీదేవి అష్టావతారల ప్రసక్తి ఉంటుంది.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
శ్రీమహాలక్ష్మీ అష్టావతారాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ విధంగానైతే ఒక తల్లి తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం కోసం రోజూ రక రకాల అవతారాలను స్వీకరిస్తుందో అలాగే ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవి కూడా అష్టమూర్తి తత్వంతో విరాజిల్లుతోంది.
అష్టలక్ష్మీ తత్వంతో జీవితం చరితార్థం
మానవ జీవితం సుఖసంతోషాలతో సాగిపోవాలంటే అష్టలక్ష్మీ స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి. అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసం ఈ అష్టలక్ష్మీ రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ స్వరూపాలను గురించి తెలుసుకుందాం.
ఆదిలక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మీ స్వరూపం. ప్రాణులకు మూలాధారమైన శక్తి ప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆది లక్ష్మీదేవి. శారీరక, మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఆది లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మనకు ఇవన్నీ కావాలంటే ఆ ఆది లక్ష్మీదేవిని తప్పకుండా ప్రార్ధించాలి.
ధాన్యలక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో రెండవది ధాన్యలక్ష్మీ స్వరూపం. పుట్టిన బిడ్డకి స్తన్యాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడేది మాతృమూర్తి. అలాగే మనకి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మి దేవి. సమస్త రకాలైన ధాన్య సంపదని, పాడి పంటలనీ ప్రసాదించే ఈ తల్లిని ప్రార్ధిస్తే ఆమె అనుగ్రహం వల్ల పాడిపంటలు, ధాన్య రాశులకు లోటుండదు.
ధైర్యలక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట లక్ష్మీ రూపాల్లో మూడవది ధైర్యలక్ష్మీ స్వరూపం. ఆపద సమయంలో మనకు అవసరమైన శారీరక బలాన్ని, మానసిక ధైర్యాన్ని ప్రసాదించి కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మీ. ఈ తల్లిని ప్రార్ధిస్తే మనోబలానికి లోటుండదు.
గజలక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో నాలుగవది గజలక్ష్మీ స్వరూపం. ముత్తయిదువలు వైభవ లక్ష్మీ రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. సకల శుభకరిణి అయిన గజ లక్ష్మీదేవి మనం సాధించిన విజయం సమాజానికి శుభకరం అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే సమాజ హితానికి కారణభూతమయ్యేది, మన విజయం వల్ల అందరూ సుఖపడాలి. అదే నిజమైన శుభం!.
సంతాన లక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో ఐదవది సంతానలక్ష్మీ స్వరూపం. మాతృత్వం స్త్రీజన్మకు వరం. అలంటి వరాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మీ స్వరూపం. జీవితంలో మనం సాధించిన అభివృద్ధిలో, మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి. ఆ పిల్లలు మన జ్ఞానవిజ్ఞాన ఆచార సంస్కృతీ వైభవాలని ముందు తరానికి తీసుకు వెళ్లగలిగే సత్సంతానం అయి ఉండాలి. అటువంటి సత్సంతనాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మీ.
విజయ లక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో ఆరవది విజయలక్ష్మీ స్వరూపం. మనం ఏ పని చేసినా మన వెన్నంటే ఉండి మనకు విజయాలను ప్రసాదించేది విజయలక్ష్మీ స్వరూపం. అయితే ఇక్కడ మనం చేసే పనులు శాస్త్ర సమ్మతమైనవి, ధర్మ బద్దమైనవి మాత్రమే అయి ఉండాలి. అప్పుడే ఆ విజయలక్ష్మీ దేవి అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి.
విద్యాలక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట లక్ష్మీ రూపాల్లో ఏడవది విద్యాలక్ష్మీ స్వరూపం. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందాలన్నా, వివేకం, బుద్ధి జ్ఞానం లభించాలన్నా విద్యతోనే సాధ్యం. మనకు అలాంటి విద్యాబుద్ధులు ప్రసాదించేది విద్యాలక్ష్మీ స్వరూపం. జీవితంలో ప్రతి దశలోను మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానానికి లోటుండదు.
ధన లక్ష్మీ సదా పాలయమాం!
శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట లక్ష్మీ రూపాల్లో ఎనిమిదవది చివరిది ధన లక్ష్మీ స్వరూపం. 'ధనమూలం ఇదం జగత్' అంటారు పెద్దలు. జీవితంలో డబ్బు లేకుంటే ఏదీ లేదు. మన తెలివితేటలతో, శ్రమతో కష్టించి పనిచేస్తే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ధనలక్ష్మీ స్వరూపమే! అయితే ధన లక్ష్మీ దేవిని ప్రార్ధించాలంటే ముందుగా మనం నీతి నిజాయితీగా ఉండాలి. ధన లక్ష్మీ దేవి కేవలం సత్సంపదలను మాత్రమే అనుగ్రహిస్తుంది.
నిజాయితీగా సంపాదించినా ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. అవినీతితో లక్షలు సంపాదించినా అది నిలువదు. ఈ ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే ప్రతి ఇల్లూ లక్ష్మీ నివాసమే! ఈ జగమంతా లక్ష్మీ నిలయమే! ఈ అష్టలక్ష్మీ స్వరూపాలను ప్రతి నిత్యం స్మరించుకుంటే జీవితంలో దేనికీ లోటుండదు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.