Rs.2 Lakh Crop Loan Waiver Guidelines in Telangana : పంట రుణమాఫీ మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో భూమి ఉన్న రైతు కుటుంబానికి స్వల్పకాలిక పంటల సాగు కోసం తీసుకున్న 2 లక్షల వరకు రుణబకాయిలు మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. వాణిజ్య, గ్రామీణ, డీసీసీబీ, పీసీఏఎస్లలో తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. కేబినెట్ తీర్మానం మేరకు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల బకాయిలకు పథకం వర్తిస్తుందని వెల్లడించింది.
రుణం అసలు, వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రైతు కుటుంబాన్ని నిర్ణయించేందుకు తెల్లరేషన్ కార్డులోని వివరాలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రుణ ఖాతాలోని ఆధార్ సంఖ్యను పాస్‌బుక్, ఆహారభద్రత కార్డుల డేటా బేస్‌కు అనుసంధానం చేసిన కుటుంబాలను గుర్తిస్తారు.
వీరికి రుణమాఫీ రాదు : స్వయం సహాయక బృందాలు, తాకట్టు, ఉమ్మడిగా తీసుకున్న రుణాలు, కౌలు రైతుల కార్డులపై అప్పుల బకాయిలు ఈ పథకం పరిధిలోకి రావని వ్యవసాయ శాఖ వెల్లడించింది. పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు కూడా వర్తించదని తెలిపింది. కంపెనీలు, సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు ఈ పథకం పరిధిలోకి రావని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంలోని మినహాయింపులను వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపారు.
వారికి రుణమాఫీ లేదు - తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి!
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : రాష్ట్రస్థాయిలో పంట రుణమాఫీ పథకం అమలు అధికారిగా వ్యవసాయ డైరెక్టర్ ఉంటారు. రుణమాఫీ పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ప్రతీ బ్యాంకులో ఒక అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. రుణమాఫీ అర్హుల వివరాలను బ్యాంకులు ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా డిజిటల్ సంతకాలతో వ్యవసాయ శాఖకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకర్లపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అర్హులైన రైతుల రుణ ఖాతాలకు నేరుగా సొమ్ము జమ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపారు. పీఏసీఎస్ రుణాలను మాత్రం డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
అవసరమైతే రికవరీ చేసే అధికారం : రెండు లక్షల రూపాయలకు మించి ఉన్న రుణాన్ని రైతు కుటుంబం ముందుగా చెల్లించాక మిగతా బకాయిలను మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కుటుంబంలో మొదట మహిళల పేరిట రుణం మాఫీ చేసి ఆ తర్వాత పురుషుల అప్పు బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. మోసపూరితంగా అర్హత లేని రైతులు రుణమాఫీ పొందితే రికవరీ చేసే అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు అప్పగించింది.
రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీ పోర్టల్ లేదా మండల సహాయ కేంద్రాల ద్వారా రైతులు ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపిన ప్రభుత్వం ఆ ఫిర్యాదులు, వినతులను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖకు ప్రభుత్వం తెలిపింది.
హరీశ్‌రావు రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలి - రూ.2 లక్షల రుణమాఫీ పక్కా : కాంగ్రెస్ నేతలు - Congress On Harish Rao Challenge