Telangana Cyber Security Bureau Refund RS 31 Crore to Victims : సైబర్ నేరగాళ్ల దాడుల్లో ఒకసారి వారి చేతుల్లోకి వెళ్లిన సొమ్ము తిరిగి బాధితుని వద్దకు రావడమంటే ఏదో అద్భుతమే జరగాలి. ఇలా చాలా మంది అనేక రకాల సైబర్ దాడుల్లో కోట్ల రూపాయల సొమ్మునే పోగొట్టుకున్నారు. సైబర్ దొంగలు చేస్తున్న ఈ ఘరానా మోసాలను ఒక్కోసారి పోలీసులు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇలా సైబర్ మోసాలు బాధితులు ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అనునిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర సైబర్ దాడి జరుగుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ బాబులు బాగా రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ఇలాంటి వారిని గుర్తించడం కఠినంగానే ఉండేది కానీ వారితో పాటు పోలీసులు కూడా కొత్త పంథాలను ఎంచుకోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడేవారిని గుర్తించి వారి నుంచి సొమ్మును దాదాపుగా రికవరీ చేస్తున్నారు.
ముఖ్యంగా సైబర్ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీతో కలిసి పోగొట్టుకున్న బాధితుల సొమ్ము రూ.31.29 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. దీంతోపాటు సైబర్ నేరాలకు సంబంధించి దీర్ఘకాలంగా బ్యాంకుల వద్ద నిలిచిపోయిన బాధితుల సొమ్మును లోక్ ఆదాలత్ ద్వారా కూడా వారికి ఇప్పించినట్లు తెలిపారు.