Heavy Rain Alert To Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ను అందించింది. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీలోని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 28, 29వ తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లుగా వెల్లడించింది. ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ : దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30కిమీ వేగంతో వాయుగుండం కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైవుందని ఎస్డీఎమ్ఏ తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఏపీలోని కోస్తాంధ్రలో వాతావరణశాఖ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు గంటకు 50-70కిలోమీటర్లు, ఎల్లుండి నుంచి 55 -75కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతన్నలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. పండించిన ధాన్యాన్ని సురక్షితమైన ప్రదేశాలలో ఉంచుకోవాలని వెల్లడించింది. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలతో సపోర్ట్ అందించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయింది. ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29న జరగాల్సిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంవో నిర్ణయించింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏయూ(ఆంధ్రాయూనివర్సిటీ) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం విధితమే. ఈ పర్యటనలో భాగంగా ఏపీలోని అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ, తుపాను నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
ఇక నుంచి పిడుగు గుట్టు తెలుసుకోవచ్చు - ఈ యాప్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చు - ఎలా అంటే ?