Sambhal Violence : ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. మొత్తం 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. తలకు గాయమైన ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలు పెరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం సంభాల్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 వరకు అధికారుల ఆదేశాలు లేకుండా సంభాల్‌లోకి బయటి వ్యక్తులు, సామాజిక సంస్థ లేదా ప్రజా ప్రతినిధులు ప్రవేశించకుండా నిషేధించింది.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ ప్రార్థనా మందిరం- మరో ప్రార్థనా మందిరాన్ని కూల్చి నిర్మించారన్న పిటిషన్ విచారణలో భాగంగా స్థానిక కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే కోసం వెళ్లిన అధికారులపై వెయ్యిమందికి పైగా స్థానికులు రాళ్ల దాడి చేశారు. 10కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సర్వే నిర్వహించారు.
'విభేదాలను సృష్టిస్తున్న ప్రభుత్వం'
దేశ అభివృద్ధి కోసం కాకుండా ప్రజల మధ్య విభేదాలను సృష్టించడానికే బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అంశంలో వీలైనంత తర్వగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోని న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తొందపాటు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇతర పార్టీల మాటలు వినకుండా తొందరపాటుతో వ్యవహరించిన తీరే- అక్కడి పరిస్థితులకు కారణమయ్యిందని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు న్యాయం చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలను కాపాడాలని రాష్ట్ర ప్రజలకు ప్రియాంక విజ్ఞప్తి చేశారు.
2500 మందిపై కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 2500 మందిపై కేసు నమోదు చేసినట్లు సంభల్ ఎస్పీ కృష్ణ కుమార్ తెలిపారు. వాళ్లని సీసీటీవీ, డ్రోన్ సాయంతో గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
#WATCH | Uttar Pradesh: On the incident of stone pelting in Sambhal, Sambhal SP Krishna Kumar Bishnoi says, " a total of 7 firs have been filed against about 2500 people. all the people will be identified with the help of cctv and drone cameras. a case has also been filed against… pic.twitter.com/0KUwf9xKaL
— ANI (@ANI) November 25, 2024