Buy Now Pay Later Pros And Cons : ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో 'బై నౌ, పే లేటర్' (BNPL) మంచి ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే, సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినా, నచ్చిన, అవసరమైన వస్తువులు కొనడానికి ఇది వీలుకల్పిస్తుంది. అయితే పేమెంట్ విధానం వల్ల లాభాలతోపాటు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- బీఎన్‌పీఎల్ పద్ధతి ద్వారా మీరు కోరుకున్న వస్తువును ముందుగా కొనుగోలు చేయవచ్చు. తరువాత ఆ డబ్బులను వాయిదా పద్ధతి(ఇన్స్టాల్మెంట్స్)లో కట్టవచ్చు. సకాలంలో పేమెంట్స్ చేసినంత వరకు ఎలాంటి వడ్డీలు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక వేళ సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతే, లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జీలతోపాటు భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒక వేళ మీరు రుణ వ్యవధిని పెంచుకుంటే, ఆ సమయానికి కూడా అధిక మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అందుకే బీఎన్‌పీఎల్ పద్ధతిలో వస్తు, సేవలు కొనేముందు కచ్చితంగా వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు, పెనాల్టీలు, రీపేమెంట్ నిబంధనలు, డెడ్‌లైన్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
- ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్, డిస్కౌంట్స్, డీల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. పైగా చేతిలో డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. 'ముందు కొనండి, తరువాత చెల్లించండి' (BNPL) అని ఊరిస్తుంటాయి. వాస్తవానికి చాలా మంది ఈ ట్రాప్‌లో పడిపోతుంటారు. కనుక ఇలాంటి ఆఫర్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే, కచ్చితంగా మీరు ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి. మీకు అవసరమైతేనే వస్తు, సేవలు కొనుగోలు చేయాలి. అది కూడా సకాలంలో రుణం తీర్చగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ పని చేయాలి. అనవసరమైన వస్తువులు కొనకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఇప్పటికే మీకు ఇతర రుణాలు ఉంటే, వాటిని తీర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.
- బీఎన్‌పీఎల్ పద్ధతిలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా నియమ, నిబంధనలు అన్నీ తెలుసుకోవాలి. లేట్ పేమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీలు, రీఫండ్ పాలసీలు గురించి తెలుసుకోవాలి. అలాగే వివిధ ఈ కామర్స్ సంస్థు అందించే బీఎన్‌పీఎల్ సర్వీస్‌లను సరిపోల్చి చూసుకుని, వాటిలోని బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- సాధారణంగా బీఎన్‌పీఎల్ సర్వీసులు పొందేందుకు క్రెడిట్ స్కోర్ అవసరం ఉండదు. కానీ మీరు సకాలంలో చెల్లింపులు చేయకపోతే, సదరు సంస్థలు ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల భవిష్యత్‌లో మీకు బ్యాంకు లోన్స్ రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కనుక సకాలంలో డబ్బులు చెల్లించగలిగితేనా ఈ 'బై నౌ, పే లేటర్' సదుపాయాన్ని వాడుకోండి.
- చాలా మంది అనవసరమైన వస్తువులను కొంటూ ఉంటారు. దీని వల్ల వారిపై అనవసర ఆర్థిక భారం పడుతుంది. కనుక వీలైనంత వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఆఫర్ ఉంది కదా అని అవసరం లేని వస్తువులు కొనకండి.
ఇంతకీ బీఎన్‌పీఎల్ ఆప్షన్ వాడుకోవాలా? వద్దా?
చేతిలో సమయానికి డబ్బులు లేనప్పుడు, అత్యవసరమైన వస్తువులను బీఎన్‌పీఎల్ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. అనవసర వస్తువుల కోసం మాత్రం దీనిని వాడకూడదు. ఇప్పటికే మీకు ఎక్కువగా అప్పులు ఉంటే, ఈ సర్వీస్‌ను వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది. అప్పుడే మీరు ఆర్థికంగా బాగుంటారు.