Telangana Budget 2024 : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికిఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు.
Telangana Vote On Account Budget 2024 :నీటిపారుదల రంగంలో గత బీఆర్ఎస్ సర్కార్ సాధించింది ఏమీ లేదని భట్టి విక్రమార్క(Bhatti Speech in Budget Sessions 2024 ) విమర్శించారు. పదేళ్లలో అనుసరించిన ఒంటెద్దు పోకడలు, సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. నీటిపారుదల శాఖకు 28 వేల 24 కోట్ల రూపాయలు కేటాయించామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరిచ్చే ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని భట్టి ప్రకటించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
"ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం. నిర్బంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయడం మా ప్రభుత్వ సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది." - భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి
మిషన్ భగీరథ (Mission Bhagiratha Scheme) ద్వారా వేల కోట్లు ఖర్చు చేసినా పల్లెల్లో ఇప్పటికీ సురక్షిత తాగు నీరు అందుబాటులో రాలేదని భట్టి అన్నారు. ఎక్కువ దూరం నుంచి తాగునీటిని తీసుకోవడం వ్యయప్రయాసలకు గురి చేస్తోందని ఈ విధానాన్ని మారుస్తామన్నారు. రైతుబంధు పేరిట పెట్టుబడిదారులు, స్థిరాస్తి వ్యాపారులకే ఎక్కువ లబ్ధి జరిగిందని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఈ పథకంలో సమూల మార్పులు తెచ్చి అర్హులకే రైతు భరోసా అందిస్తామని తేల్చి చెప్పారు. ఫసల్ భీమా అమలు చేస్తామని నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు.