SRH vs RCB Match Tickets Release : ఐపీఎల్ - 2024 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతూ.. అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్కు ఇస్తోంది. గత కొన్ని సీజన్ల వరకూ పేలవమైన ఆటతీరుతో ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశలో ముంచిన సన్ రైజర్స్ జట్టు.. ఇప్పుడు అద్దిరిపోయే ఆటతీరుతో అలరిస్తోంది. ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్న హైదరాబాద్ ఆటగాళ్లు.. ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ :
ఈ నెల 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇవాళ ఆన్లైన్లో విడుదల చేశారు. పేటీఎంలో ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ నిర్వాహకులు ప్రకటించారు. అయితే.. టికెట్లు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది.
గత మ్యాచ్‌లకూ ఇంతే..
చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా చాలా తక్కువ టికెట్లు అందుబాటులో ఉంచినట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు ఆన్లైన్లో ఉంచిన ఐదు నిమిషాల్లోనే అయిపోయినట్టు ప్రకటించారని మండిపడ్డారు. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్ గడ్డకు వచ్చిన ధోనీ ఆట చూడాలని సగటు క్రికెట్ అబిమానులు ఉప్పల్ స్టేడియం బాట పట్టారు. కానీ.. అతి కొద్ది మందికి మాత్రమే ఆన్లైన్లో టికెట్లు దక్కాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
బ్లాక్‌లో అమ్ముతున్నారని ఆగ్రహం..
అభిమానులు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఉవ్విళ్లూరుతున్నప్పటికీ.. టికెట్లే అందుబాటులో ఉండట్లేదని ఆవేదన చెందుతున్నారు. చెన్నై జట్టుతో మ్యాచ్ సందర్భంగా ఆన్లైన్లో ఉంచిన టికెట్లు.. విడుదలైన కాసేపట్లోనే అమ్ముడైనట్లు చూపించారు. ఈ స్టేడియంలో సుమారు 40 వేల మంది కూర్చునే సామర్థ్యముంది. అలాంటిది.. ఐదు నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడయ్యాయని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిర్వాహకులు బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ ఇదే తంతు నడుస్తోందని మండి పడుతున్నారు.
20,000 ధర కలిగిన టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతూ.. 2500, 750 ధర కలిగిన టికెట్లను పూర్తిగా బ్లాక్ చేస్తున్నారని అంటున్నారు. ఆన్‌లైన్ సంస్థతో చేతులు కలిపిన కొందరు క్రికెట్ పెద్దలు.. బ్లాక్ టికెట్ల దందా సాగిస్తున్నారని మండి పడుతున్నారు. మరి.. ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మీరు గనక టికెట్లు కొనుగోలు చేయాలని అనుకుంటే.. వెంటనే పేటీఎంలోకి వెళ్లి కొనుగోలు చేయండి.