Vitage Cars Show in Secunderabad : కాలం ముందుకు వెళుతున్న కొద్దీ పాత వాటికి విలువ పెరుగుతూ ఉంటుంది. అది వస్తువులైనా, మనుషుల మధ్య బంధాలైనా. మరీ ముఖ్యంగా ఇప్పట్లో అందుబాటులో లేని వాటికైతే ఆ విలువ అమూల్యం. వందల కిలోమీటర్లు అయినా కాలినడకనే ప్రయాణం సాగించిన కాలంలో వాడిన కార్లు, జీపులు నేటి తరం వాళ్లకి ఎంతో గొప్పగా అనిపిస్తాయి. అలాంటి వింటేజ్ కార్లతో కాఫీ అండ్ కార్స్ అనే సంస్థ సికింద్రాబాద్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. శతాబ్దం కిందటి కాలం నాటి ఈ వాహనాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు.
వింటేజ్ కార్లు హైదరాబాద్‌లో మనకు పెళ్లి ఊరేగింపుల సందర్భంలో అప్పుడప్పుడు రోడ్లపై కనివిందు చేస్తాయి. అయితే అవి కూడా కొన్ని మాత్రమే కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితం. వాటి అద్దెలు కూడా చాలా ఎక్కువే ఉంటాయి. అయినప్పటికీ ప్రత్యేకత కోసం వాటిని పెళ్లి బరాతిలో వినియోగిస్తారు. ఇక నిజాం కాలంలో వాడిన కారులైతే బయట ఎక్కడా అందుబాటులో ఉండవు. మ్యూజియంలో మాత్రమే మనం వాటిని చూడగలం. ఇలాంటి అపురూపమైన నాటి కాలపు కార్లను నేటి తరం వాళ్లకు చూపెట్టేందుకు సికింద్రాబాద్‌లో కార్స్ అండ్ కాఫీ అనే సంస్థ వ్యవస్థాపకుడు దీపక్ గతేడాది నుంచి దీనిని కొనసాగిస్తున్నారు.
ప్రతి ఆదివారం ఫ్రీ : హైదరాబాద్ హెరిటేజ్‌ను ప్రపంచానికి చూపెట్టేందుకు దీనిని ప్రారంభించానని ఆయన తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రదర్శనలో కొన్ని కంపెనీలతో పాటుగా సిటిజన్లు తమ దగ్గర ఉన్న వాహనాలను ఉచితంగానే ప్రదర్శనలో పెడతారని తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కారు, బైక్ ప్రియులకు వింటేజ్ ఫీల్‌ను తీసుకు రావటానికే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించానని తెలిపారు. ఎంట్రీ కూడా ఫ్రీ ఉండటంతో ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆయన తెలిపారు.