Students Facing Problems With Lack Of Facilities :ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులు కరవై, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓచోట శిథిలావస్థకు చేరిన భవనాలుంటే, మరోచోట అసంపూర్తిగా ఉన్నాయి. ఒకచోట ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, మరోచోట ప్రయోగ శాలలు ఉన్నా సామగ్రి లేక నిరుపయోగంగా ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫర్నీచర్ లేక అరకొర వసతుల నడుమ విద్యార్థులు చదువు నెట్టుకొస్తున్నారు.
ల్యాబ్స్ ఉన్నా పనికిరావు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో 56 ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్ కళాశాలల్లో 19 వేల మంది చదువుకుంటున్నారు. వారంతా చాలీచాలని సౌకర్యాలతో విద్యను కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 10 కోర్సులకు గానూ 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకేషనల్ కోర్సులు కాబట్టి కచ్చితంగా ప్రయోగశాలలు అవసరం. కానీ ఒక్కటీ లేవు. విద్యార్థులకు సరిపడా కొత్త భవన నిర్మాణం జరిగినా, అసంపూర్తిగా వదిలేశారు. 2019లోనే భవనం పూర్తయినా ప్రారంభించే దిక్కులేదు. అందులోనే విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు.
ఒకే షెడ్డులో నాలుగు తరగతులకు పాఠాలు - ఇట్లయితే మేం చదుకునేదెలా? - NAKREKAL GOVT SCHOOL PROBLEMS
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. అక్కడున్న ప్రయోగశాలను కూల్చేసి ఒకేషనల్ జూనియర్ కాలేజీ కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోగశాలలు లేకుండాపోయాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఒక్కో మీడియంలో 4 గ్రూపుల చొప్పున కోర్సులు నడుస్తున్నాయి. 1200 మందికి పైగా విద్యార్థులుంటారు. వారికి సరైన వసతులు లేవు. ఉన్న మూత్రశాలల్నే బాలుర జూనియర్ కాలేజీ, ఒకేషనల్ కళాశాల విద్యార్థులు వినియోగించుకోవాల్సిన దుస్థితి.
"సరిపడా తరగతి గదులు లేవు. బెంచీలు లేక కింద కూర్చొని చదువుకుంటున్నాం. ల్యాబ్స్ లేవు. కొత్త భవనం కట్టి మధ్యలో ఆపేశారు. ప్రాక్టికల్స్ అన్నీ బయట చేస్తున్నాం. వర్షం వచ్చిందంటే ఆరోజు ల్యాబ్ ఉండదు." - విద్యార్థులు
నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కొరవడ్డాయి. అక్కడి విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేవు. సరిపడా గదులు, ఫర్నీచర్ లేదు. 1995లో నిర్మించిన ఆ కళాశాల అప్పుడే శిథిలావస్థకు చేరుకుంది. కళాశాల చుట్టూ చెత్తా చెదారంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.