Clean Air In Mahakumbh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా అందరి మన్ననలు అందుకుంటోంది. కోట్లాది భక్తజనం పోటెత్తుతున్నా ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలికి కొదువ ఉండటం లేదు. దీంతో పర్యావరణపరంగానూ ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది. ఇందుకు కారణం ఒక జపనీస్ టెక్నిక్. ఇంతకీ అదేమిటి? దానివల్ల ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలి, పుష్కలమైన ఆక్సిజన్ ఎలా అందుబాటులోకి వచ్చింది? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
రెండేళ్ల క్రితమే 5 లక్షలకుపైగా మొక్కలు!
మహాకుంభ మేళా జనవరి 13న ప్రారంభమైవ్వగా, వాస్తవానికి ఈ మహా ఘట్టం కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్‌రాజ్ పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. అది ఆషామాషీగా తయారు కాలేదు. ఇందుకోసం ప్రయాగ్ రాజ్‌లోని 10 ప్రదేశాల్లో ఉన్న 18.50 ఎకరాల భూమిలో 5 లక్షలకుపైగా మొక్కలను నాటారు. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగి, ఇప్పుడు ప్రతిరోజు దాదాపు 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతున్నాయి.
ప్రస్తుతం ఒక్కో చెట్టు ఎత్తు దాదాపు 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల దాకా ఉంది. ఒక్కో చెట్టు నుంచి రోజూ సగటున 230 లీటర్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. మియవాకి టెక్నిక్‌తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపాలిటీ దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 63 రకాల మొక్కలను నాటారు. ఈ జాబితాలో మర్రి, రావి, వేప, మహువా, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రాహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ వంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార ప్రాయ మొక్కలన్నీ ఈ చిట్టడవిలో ఉండటం విశేషం. దీని నిర్వహణ కాంట్రాక్టును మూడేళ్ల వ్యవధి కోసం ఒక కంపెనీకి అప్పగించారు. ప్రయాగ్ రాజ్ పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్, బాలూ మండి, అవంతిక కాలనీ -నైనీ, దేవఘాట్ పార్క్ -ఝాల్వా, ట్రాన్స్‌పోర్ట్ నగర్ పార్క్ -2 తదితర ఏరియాల్లో ఈ చిట్టడవి విస్తరించి ఉంది.
మొక్కలను ఇలా నాటారు!
ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ ఇంజినీర్ ఉత్తమ్ కుమార్ ఈ చిట్టడవి కోసం చేసిన కసరత్తు గురించి ఇలా వివరించారు. "మియవాకి టెక్నాలజీతో మేం తొలుత ప్రయాగ్‌రాజ్‌లోని నైని ఏరియా పారిశ్రామిక ప్రాంతంలో 9 ఎకరాల్లో మొక్కలను నాటాం. అది పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో చెత్త వేసేవారు. దాని నుంచి వచ్చే దుర్వాసనను పరిసర ప్రాంతాల ప్రజలు భరించలేకపోయేవారు. ఆ ప్రాంతంలో ఇళ్ల బయట బట్టలు ఆరవేస్తే కాసేపట్లోనే అవి దుమ్మూధూళితో నల్లగా మారిపోయేవి. అందుకే ఆ ఏరియాలో మేం గుంతలను మీటరు లోతు దాకా తవ్వి, చెత్తను తీసి పారేసి సేంద్రీయ ఎరువు, గడ్డి, రంపపు పొట్టుతో నింపాం. ఆ తర్వాతే మొక్కలను నాటాం" అని ఉత్తమ్ కుమార్ తెలిపారు. మహాకుంభ మేళాకు తొలి 11 రోజుల్లోనే 10 కోట్ల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. వచ్చే నెలలో ఈ మేళా ముగిసే సరికి దాదాపు 45 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇంతభారీగా భక్తజనం తరలి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండకుండా ప్రయాగ్ రాజ్‌లోని చిట్టడవి ఊపిరులు ఊదుతోంది.
ఏమిటీ మియవాకి టెక్నిక్?
తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి, పెంచేందుకు దోహదం చేయడమే మియవాకి టెక్నిక్ ప్రత్యేకత. ఈ పద్ధతిని జపాన్‌కు చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త అకీరా మియవాకి 1970లో ఆవిష్కరించారు. ఈ పద్ధతిలో దేశీయ మొక్కల వంగడాలను మాత్రమే నాటుతారు. ఎందుకంటే అవి నేల స్వభావానికి అనుగుణంగా ఎదగగలవు. మియవాకీ తోటల్లో ఒక మొక్కకు, మరో మొక్కకు మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల స్థలం ఆదా అవుతుంది. ఎక్కువ మొక్కలను నాటొచ్చు. ఎక్కువ ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదలయ్యేలా చేయొచ్చు. దీనివల్ల మట్టి నాణ్యత కూడా పెరుగుతుంది. ప్రయాగ్ రాజ్‌లోని చిట్టడవిని కూడా ఇదే విధంగా సిద్ధం చేశారు.