Benefits Of Life Insurance Add-Ons : జీవిత బీమాకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇది పాలసీదారుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. వారి కోసం సంపదను సృష్టిస్తుంది. పదవీ విరమణ సమయానికల్లా ఆదాయాన్ని ఆర్జించే హామీని ఇస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే కుటుంబం కోసం ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆసరాగా నిలుస్తుంది. అంతేకాదు దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రీమియంలను చెల్లిస్తే, పదవీ విరమణ సమయానికి నెలవారీ ఆదాయాన్ని అందించే యాన్యుటీ బీమా పాలసీలు సైతం అందుబాటులో ఉన్నాయి. పాలసీ రకాన్ని బట్టి, అది అందించే ప్రయోజనాన్ని బట్టి ప్రీమియంలు మారుతాయి. అయితే బీమా పాలసీలను కొన్ని 'యాడ్-ఆన్స్' (రైడర్స్)తో తీసుకుంటే వివిధ అంశాల్లో నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఫలితంగా మీ ఆర్థిక లక్ష్యాలను మరింత సులభంగా చేరుకోవచ్చు.
తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తే
జీవిత బీమా పాలసీపై 'తీవ్ర అనారోగ్య ప్రయోజనం' (Critical Illness Benefit) అందించే యాడ్-ఆన్‌ను తీసుకోవచ్చు. అది విపత్కర పరిస్థితుల్లో పాలసీదారులకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ యాడ్-ఆన్ వల్ల గుండెపోటు, యాంజియో ప్లాస్టీ, బ్రెయిన్ సర్జరీ, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులను జీవిత బీమా సంస్థలు కవర్ చేస్తాయి.
ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న ధూమపానం చేయని పురుష పాలసీదారుడు 30 ఏళ్ల పాలసీ కాలవ్యవధి కోసం నెలకు రూ.1,399 చొప్పున అదనపు ప్రీమియంతో రూ.50 లక్షలు విలువైన తీవ్ర అనారోగ్య ప్రయోజన యాడ్-ఆన్‌ను కొనొచ్చు. ఇంతే పాలసీ వ్యవధి, ప్రయోజనం కోసం ధూమపానం చేయని 30 ఏళ్ల మహిళ నెలకు అదనంగా రూ.977 చొప్పున ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. దీనికింద కవర్ అయ్యేవారికి ఏవైనా తీవ్ర అనారోగ్య సమస్యలు నిర్ధరణ అయితే, చికిత్సకు అయ్యే ఖర్చును జీవిత బీమా సంస్థ చెల్లిస్తుంది. దీనివల్ల ఈ పాలసీ తీసుకున్నవారి పొదుపు మొత్తాలకు ఎలాంటి ఢోకా ఉండదు. వైద్యఖర్చుల గురించి ఆందోళన చెందడం మానేసి, ఉత్తమమైన చికిత్సను పొందడంపై దృష్టి పెట్టొచ్చు.
జీవిత బీమా సంస్థ నుంచి వైద్య ఖర్చులను అందుకున్నా, జీవిత బీమా కవరేజీ కొనసాగుతుంది. వైద్యఖర్చులు ఏటా సగటున 14 శాతం మేర పెరుగుతున్నాయి. అందుకే ఇలాంటి యాడ్-ఆన్ బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కీమోథెరపీకి రూ.25 లక్షల దాకా ఖర్చవుతుంది. ఇక ఇతరత్రా ఖర్చులు ఎంతగా ఉంటాయో వేరేగా చెప్పనక్కర్లేదు.
ప్రమాదంలో మరణిస్తే
మన దేశంలో ఏటా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ గణాంకాల ప్రకారం, 2023 సంవత్సరంలో మన దేశంలో రోడ్డు ప్రమాదాలు దాదాపు 11.9 శాతం పెరిగాయి. అందుకే జీవిత బీమా పాలసీతో పాటు 'ప్రమాద మరణ ప్రయోజనం' (Accidental death benefit) అనే యాడ్-ఆన్‌ను తీసుకోవాలి. దీనివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన పాలసీ హామీ మొత్తాన్ని(లైఫ్ కవర్) పెంచుకోవచ్చు.
ధూమపానం అలవాటు లేని 30 ఏళ్ల పురుషుడు/మహిళ నెలవారీ జీవిత బీమా పాలసీ ప్రీమియంకు అదనంగా రూ.300 చొప్పున చెల్లిస్తే ఈ యాడ్-ఆన్ లభిస్తుంది. ఫలితంగా వారి లైఫ్ కవరేజీ మొత్తానికి అదనంగా రూ.50 లక్షలు కలుస్తాయి. ఈ యాడ్-ఆన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో మచ్చుకు తెలుసుకుందాం. ఉదాహరణకు రూ.1 కోటి జీవిత బీమా కవరేజీ కలిగిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే, నామినీకి రూ.1.50 కోట్లు వస్తాయి. ఫలితంగా పాలసీదారుడి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.
ప్రీమియం మినహాయింపు కోసం
ఏదైనా ప్రమాదం కారణంగా అకస్మాత్తుగా జీవిత బీమా పాలసీదారు శాశ్వత వైకల్యాన్ని పొందితే, అతని లేదా ఆమె దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలసీదారుల జీవితం సాఫీగా సాగేందుకు దోహదం చేసే ‘యాడ్-ఆన్’ ఒకటి అందుబాటులో ఉంది. అదే 'ప్రీమియం మినహాయింపు రైడర్' (Waiver-of-premium rider). ఇది తీసుకుంటే పాలసీదారు అకస్మాత్తుగా శాశ్వత వైకల్యాన్ని పొందినప్పుడు ప్రతినెలా బీమా ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్ ప్రీమియంలు అన్నీ జీవిత బీమా కంపెనీయే చెల్లిస్తుంది. వినియోగదారుడు అన్ని ప్రయోజనాలను అందుకోవచ్చు.
ఈ యాడ్-ఆన్ కోసం నెలవారీ బీమా ప్రీమియంపై అదనంగా ఎంత కట్టాలో చూద్దాం. ఉదాహరణకు నెలవారీ జీవితబీమా ప్రీమియం రూ.10,000 ఉంటే, 30 ఏళ్ల పురుషుడు నెలకు రూ.110 చొప్పున అదనంగా చెల్లించి పదేళ్ల వ్యవధి కోసం ఈ యాడ్-ఆన్‌ను పొందొచ్చు. ఇంతే వయసున్న మహిళలు రూ.116 చొప్పున చెల్లించి దీన్ని తీసుకోవచ్చు.
ఒక్క సంతకంతో రూ.4 లక్షలు బీమా - ఈ స్కీమ్ గురించి ఎంత మందికి తెలుసు?
హెల్త్ ఇన్సూరెన్స్ Vs మెడిక్లెయిమ్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్?