Demolish Illegal Construction In Jubilee Hills : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయని, వాటిని తొలగించాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు, ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని తెలిపారు. కొనసాగుతున్న నిర్మాణ పనులు ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సమగ్ర విచారణ జరిపి అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ తాజా ఆదేశాల ప్రకారం మొత్తం జీ+12 అంతస్తుల భవనం కూల్చివేయాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
దస్త్రాలను పరిశీలించకుండానే అనుమతులు : హైదరాబాద్‌లో నందగిరిహిల్స్‌లో హెచ్‌ఎండీఏకు చెందిన స్థలం 4.78 ఎకరాలను, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన 865.42 చదరపు గజాల స్థలం కలిపి భారీ నిర్మాణానికి నెట్, నెట్ వెంచర్స్ సంస్థ అనుమతులు తీసుకుంది. ఇక్కడ నందగిరిహిల్స్‌కు చెందిన హెచ్‌ఎండీఏ స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన స్థలంగా చూపించారు. మొదట 2021లో ఏడు సెల్లార్లు, జీప్లస్ 5 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులు దస్త్రాలను పరిశీలించకుండానే అనుమతులు జారీ చేశారు.
రాజకీయ నాయకుల ప్రమేయం : నిర్మాణం ప్రారంభించిన తర్వాత అనుమతులను మార్చి కొత్తగా ఏడు స్టిల్ట్, జీప్లస్ 12 అంతస్తులకు అనుమతులు జారీ చేశారు. దీనిపై నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తరఫున పలువురు ఫిర్యాదులు చేసినా నగరపాలక సంస్థ అధికారులు పెడచెవిన పెట్టారు. విజిలెన్సు విభాగం రంగంలోకి దిగి విచారణ చేయడంతో ఇక్కడ భారీ ఉల్లంఘనలు పాల్పడ్డారని తెలిసింది. ఈ నిర్మాణ సంస్థ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మూడేళ్లుగా న్యాయవివాదాల అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ నిర్మాణ సంస్థ వాదనలను బుధ, గురువారాలు విని ఆదేశాలు జారీ చేశారు.
గుర్తించిన ఉల్లంఘనలు, ఆదేశాలివి
- ప్రభుత్వం 26.09.2023న జారీ చేసిన రివైజ్డ్ అనుమతుల ప్రకారం నిర్మాణం ఉండాలి. వాటికి భిన్నంగా నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. వాటిని తొలగించాల్సిందే. 10.4.24, 27.05.24న ఇవే ఆదేశాలను జారీ చేశారు.
- అనుమతించిన దానికి భిన్నంగా స్టిల్ట్ కోసం ఎక్కువగా తవ్వారు. సెట్‌బ్యాక్ ప్రాంతంలో డ్రైవ్ ఇన్ ఏరియా కేవలం గ్రౌండ్ లెవెల్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ దీనికి భిన్నంగా నిర్మిస్తున్నారు.
- అగ్నిమాపక యంత్రాలు వెళ్లే విధంగా కనీసం 7 మీటర్ల చొప్పున పక్కలు, వెనుక వైపు సెట్‌బ్యాక్ వదలాలి. ర్యాంపులు స్టిల్ట్ లెవెల్‌లో నందిగిరి హిల్స్ వైపు నిర్మాణం చేసినట్లు గుర్తించారు. ఇక్కడ సెట్‌బ్యాక్ కోసం వదలాల్సి ఉంది.
- ప్రధాన ఉల్లంఘనల్లో శ్లాబ్‌ల ఎత్తు సక్రమంగా లేదు. అనుమతులు పొందిన దాని కన్నా తక్కువ ఎత్తులో నిర్మించారు. స్టిల్ట్ ఫ్లోరు ఎత్తు 5 మీటర్లు ఉండాలి. కానీ 4.5 మీటర్ల ఎత్తులో కట్టారు. ఇలా ఐదు స్టిల్ట్‌లు పూర్తి చేశారు. ఎన్విరాన్‌మెంటల్ డెక్ ఆరు మీటర్లకు గాను 4.5 మీటర్లు మాత్రమే ఉంది. తర్వాత ఏడు అంతస్తులను 3 మీటర్ల నుంచి 4.5 మీటర్లు వరకు నిర్మించాల్సి ఉంటుంది. అనుమతించిన గరిష్ఠ ఎత్తుకంటే పెరిగిందని గుర్తించారు.
- ఈ ఉల్లంఘనల ప్రకారం నెట్ నెట్ వెంచర్స్ సంస్థ ఉల్లంఘనలను తొలగించాలి. అనుమతుల ప్రకారం నిర్మించాలి. ఉల్లంఘనలు తొలగించేంత వరకు నిర్మాణాలను నిలిపివేయాలి. లేని పక్షంలో తదుపరి చర్యలను సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ తీసుకుంటారని జీఎహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉల్లంఘనలు తొలగించాలంటే అంతస్తుల నిర్మాణంలో ఎత్తు పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం మొత్తం భవనం కూల్చివేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పరికి చెరువు పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కన్ను - త్వరలోనే కూల్చివేతలు షురూ : హైడ్రా కమిషనర్ రంగనాథ్
మణికొండ వైపు దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు - నెక్నాంపూర్లో 5 విల్లాలు నేలమట్టం