English Practice Tests in Telangana : ఇంటర్మీడియట్ స్థాయిలో కొంత మందికి ఆంగ్లం అంటే భయం. ఈ భయాన్ని పోగొట్టి, వారిలో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో గతేడాది నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. గతేడాదే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి కలిపి ప్రయోగ పరీక్షలను నిర్వహించనున్నారు.
థియరీ పరీక్షకు 80 మార్కులు కేటాయిస్తే, ప్రయోగ పరీక్షలకు 20 మార్కులు ఉంటాయని తెలిపింది. ప్రయోగ పరీక్షలో కనీసం 7 మార్కులు సాధించే వారే ఉత్తీర్ణులు అవుతారు. గైర్హాజరైన వారిని ఆంగ్ల పరీక్ష అనుత్తీర్ణులుగా పరిగణిస్తారు. ప్రథమ సంవత్సరం వారికి ఈ నెల 31న, ద్వితీయ సంవత్సరం వారికి ఫిబ్రవరి 1న ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంకో 40 రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
ఐదు అంశాల్లో పరీక్ష : ఆంగ్ల నైపుణ్యాలపై తరగతి గదిలోనే విద్యార్థుల ప్రతిభను పరీక్షించనున్నారు. మొత్తం ఐదు అంశాల్లో పరీక్షలు ఉంటాయి. ఒక్కోదానికి నాలుగు మార్కులు ఉంటాయి. కింది ఐదు అంశాల ఆధారంగా మార్కులను కేటాయిస్తారు.
- ఏదైనా సబ్జెక్టుపై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థుల మధ్య సంభాషణ జరగాలి.
- ఒక సబ్జెక్టుపై నిమిషం వ్యవధిలోపు అనర్గళంగా మాట్లాడటం రావాలి.
- తల్లిదండ్రుల నేపథ్యం లేదా ఆసక్తి గల ఇంకేదైనా అంశంపై విద్యార్థుల బృందం చర్చలు జరపాలి.
- గ్రాహక శక్తి
- రికార్డు బుక్
అన్ని కోర్సుల విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష తప్పనిసరి : ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అన్ని కోర్సుల విద్యార్థులు ఆంగ్ల ప్రయోగ పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ పరీక్షలను వారు చదువుకునే కళాశాలలోనే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు, సబ్జెక్టు అధ్యాపకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల