Ajinkya Rahane Ranji Trophy 2025 : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఓ వింతైన ఘటన జరిగింది. ముంబయి - జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానె ఔటైనట్లు భావించి అతడ్ని వెనక్కి పంపించారు. అయితే అతడు డగౌట్‌కు వెళ్లిన ఐదు నిమిషాల తర్వాత అంపైర్లు మళ్లీ రహానేను మైదానంలోకి పిలిపించారు. సరిగ్గా అదే సమయానికి ఇంకొక బ్యాటర్ కూడా మైదానంలోకి వచ్చాడు. దీంతో అతడ్ని వెనక్కి పంపించి రహానెతోనే బ్యాటింగ్‌ను కొనసాగించారు. అయితే కాసేపటికే రహానే కూడా ఔటై పెవిలియన్ బాట పట్టాడు.
ఇదీ జరిగింది!
శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లు త్వరగా ఔట్ కావడం వల్ల రహానే(16) ఆచితూచి ఆడాడు. అయితే ముంబయి ఇన్నింగ్స్‌లో 25వ ఓవర్‌ను జమ్మూకశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ వేశాడు. ఆ షార్ట్ పిచ్ బంతిని ఆడే సమయంలో బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో ఫీల్డర్లు అప్పీలు చేయడం వల్ల అంపైర్ అతడ్ని ఔట్‌గా డిక్లేర్ చేశాడు. రహానె కూడా ఆ డెసిషన్‌ను స్వాగతించి పెవిలియన్ బాట పట్టాడు. కానీ బౌలర్ క్రీజ్ బయటకు వచ్చి బంతిని విసిరినట్లు థర్డ్ అంపైర్ చెప్పాడం వల్ల రహానెను మళ్లీ ఆడేందుకు పిలిపించారు.
అప్పటికే బ్యాటింగ్ చేసేందుకు శార్దూల్ ఠాకూర్ మైదానంలోకి వచ్చాడు. దీంతో శార్దూల్‌ను డగౌట్‌కు పంపించి రహానేని ఆడించారు. అయితే నో బాల్‌పై అనుమానం ఉండటం వల్ల తొలుత రహానేను మైదానంలోనే ఉండమని అంపైర్ చెప్పాడట. కానీ, రహానెకు అది వినిపించనందున అతడు క్రీజ్‌ను వీడాడు. చివరికి అది నోబాల్‌గానే తేలడం వల్ల ఆఖరికి రహానేకు ఆడే అవకాశం వచ్చింది. అయితే అదే స్పెల్‌లో నజీర్ వేసిన బౌలింగ్‌లోనే రహానె ఔట్ అయ్యాడు. ఆఫ్‌సైడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి మిడ్ హాఫ్‌లో పరాస్ డోగ్రా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ వల్ల పెవిలియన్ చేరుకున్నాడు.
అలా తిరిగి పిలిపించొచ్చా?
అయితే మొదట్లో ఔట్ అనుకుని మైదానాన్ని వీడిన క్రికెటర్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు పిలిపించే అవకాశం ఉందా? అన్న విషయాన్ని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే, ఆ అధికారం కేవలం అంపైర్లకు మాత్రమే ఉందని నిబంధనలు చెబుతున్నాయి. ఔట్ ఇవ్వకుండానే ఆ బ్యాటర్ పొరపాటున వెళ్లిపోయాడని, అందుకే అంపైర్ సంతృప్తి చెందితే జోక్యం చేసుకోవచ్చుని క్రిటిక్స్ అంటున్నారు. ఫీల్డింగ్ జట్టు తదుపరి చర్య తీసుకోకుండా ఆపి, బ్యాటర్‌ను వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తదుపరి డెలివరీలోగా ఎప్పుడైనా సరే బ్యాటర్‌ను వెనక్కి పిలవొచ్చుట. ఒకవేళ అదే చివరి వికెట్ అయితే మాత్రం అంపైర్లు మైదానం నుంచి వెళ్లిపోయేలోగా జరగాల్సి ఉందని విశ్లేషకుల మాట.
రంజీలో స్టార్ క్రికెటర్లు ఫెయిల్! - సింగిల్ డిజిట్‌కే రోహిత్, గిల్, జైస్వాల్ ఔట్
25వ రంజీ సెంచరీ బాదిన పుజారా - బ్రియాన్ లారా రికార్డ్ బ్రేక్