Dil Raju Explains About IT Raids : నాలుగు రోజుల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరిగాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఎన్నో ఐటీ దాడులు జరుగుతున్నా, మీడియా తనపైనే ఎక్కువ ఫోకస్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి ఎంత ఫోకస్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. అందుకే ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పాలని మీడియాను పిలిచానని వివరించారు. ఐటీ దాడులకు సంబంధించి హైదరాబాద్‌లోని తన నివాసంలో దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు.
తెలిసింది, తెలియనివి ఏవేవో వార్తలు వేస్తూ హైలెట్స్ చేస్తున్నారని నిర్మాత దిల్ రాజు ధ్వజమెత్తారు. ఐటీ తనిఖీలు తమ సంస్థలో 2008లో ఒకసారి జరగ్గా, మళ్లీ దాదాపు 16 ఏళ్ల తర్వాత జరిగాయని వివరణ ఇచ్చారు. ఆ మధ్యలో మూడుసార్లు అకౌంట్స్ బుక్స్‌కు సంబంధించిన సర్వే చేశారని తెలిపారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ తనిఖీలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ అని వివరించారు. తమతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్స్‌పై కూడా ఐటీ దాడులు జరిగాయని చెప్పారు.
మొదటి మూడు రోజులు వ్యక్తిగతంగా తనిఖీలు చేసి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారన్నారు. తనిఖీలకు సంబంధించి శుక్రవారం తమ కార్యాలయంలో ముగించారని పేర్కొన్నారు. ఆఫీసులో, ఇంట్లో జరిగిన తనిఖీల్లో డబ్బు దొరికిందని ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. తమ వద్ద ఎక్కడా డబ్బు, డాక్యుమెంట్లు తీసుకోలేదని తెలిపారు.
"నా దగ్గర రూ.5 లక్షలు, మా శిరీశ్ దగ్గర రూ.4.5 లక్షలు, మా కుమార్తె ఇంట్లో రూ.6 లక్షలు, ఆఫీసులో రూ.2.5 లక్షలు ఇలా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షలు మాత్రమే ఉన్నాయి. మా దగ్గర ఏం తనిఖీ చేశారనేది ఐటీ అధికారులు పంచనామా చేసి లెటర్ ఇచ్చారు. ఐదేళ్లలో మేం ఎక్కడా ఆస్తులు కొనలేదు. పెట్టుబడులు పెట్టలేదు. ఏం జరగలేదు. సినిమా వ్యాపారానికి సంబంధించి ప్రొడక్షన్స్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నాం. సినిమా వ్యాపారానికి సంబంధించి ఐటీ అధికారులు అన్ని వివరాలు కావాలని అడిగారు." - దిల్ రాజు, నిర్మాత
ఐటీ శాఖ ఆశ్చర్యపోయింది : ఒక్కో సినిమాకు సంబంధించి 24 క్రాప్ట్స్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. తమ సంస్థలో తనిఖీలపై ఐటీ శాఖ ఆశ్చర్యపోయిందన్నారు. తనిఖీల్లో దిల్ రాజు నుంచి ఏమేమో ఊహించుకున్నామని ఐటీ అధికారులే అన్నారన్నారు. తమ సంస్థలో తనిఖీలపై ఐటీ అధికారులు సంతృప్తి చెందారని వివరించారు. గడిచిన ఐదేళ్లలో లావాదేవీలపై తమ ఆడిటర్స్, ఐటీ శాఖ చూసుకుంటారని తెలిపారు.
మా అమ్మకు గుండెపోటు వచ్చిందన్నారు : ఈ క్రమంలోనే తమ తల్లి 19వ తేదీన అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లామని దిల్ రాజు చెప్పారు. 81 ఏళ్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని ప్రచారం చేశారన్నారు. లంగ్స్‌లో ఇన్‌స్పెక్షన్ వల్ల దగ్గు ఎక్కువైతే రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దిల్ రాజును ఐటీ అధికారులు ఎందుకు టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు. తనపైనే కాదు మైత్రీ సంస్థ, అభిషేక్ అగర్వాల్‌పై కూడా ఐటీ తనిఖీలు జరిగాయని గుర్తు చేశారు. ఆదాయ పన్ను చెల్లింపు అనేది ఇల్లీగల్ కాదని, ఇలాంటి తనిఖీలు జరిగినప్పుడే తామేంటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
దిల్‌రాజు, పుష్ప-2 నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు - కీలకపత్రాలు స్వాధీనం
సినీ ప్రముఖుల కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ దాడులు - దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత