Telangana Govt on KTR in E Formula Race :ఫార్ములా - ఈ కారు కేసుపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంపై చర్చించారు. రేసు సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సీఎస్ శాంతికుమారి కేబినెట్‌కు తెలిపారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున, అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకొని గవర్నర్ అనుమతులు ఇచ్చారు.
దర్యాప్తు ప్రక్రియ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కేబినెట్‌లో చర్చించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపించేందుకు సీఎస్‌కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఫార్ములా-ఈ కారు రేసు అంశంలో ఏం జరిగిందో సీఎం, అధికారులు కేబినెట్ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందన్నారు. అర్వింద్ కుమార్‌పై కేసు నమోదు కోసం సీఎస్ ఇప్పటికే అనుమతినిచ్చారని, కేటీఆర్‌పై మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి కోరినట్లు మంత్రి తెలిపారు.