GI Tag Application for Balanagar Custard Apple : తియ్యగా ఉండే సీతాఫలాలను తినేందుకు ఎవరూ కాదంటారు.. కాయలను మాగబెట్టుకుని మగ్గావో లేదో అని ప్రతిసారి చూసుకుని తింటాం. దీని ఔషధ విలువలపై ప్రజలకు అవగాహన పెరగడంతో ప్రతి ఏటా సీతాఫలాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు(జీఐ) కోసం దరఖాస్తు చేయాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇప్పటికే దీని కోసం అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరించారు.
కాగా ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు సుమారు రూ.12.70 లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. బాలానగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు విస్తరించింది. ఆగస్టు నెలాఖరు నుంచి నవంబర్ చివరి వరకు ఆ ప్రాంతాల్లోని ఉన్న ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. రుచి, నాణ్యతకు పేరొందిన బాలానగర్ సీతాఫలాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతరత్రా ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.