A Man Was Murdered in Pan Shop : కాస్త నెమ్మదిగా మాట్లాడాలని చెప్పినందుకు ఓ వ్యక్తిని రాయితో కొట్టి చంపేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం పరిసరాలను గమనించి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ విజయదుర్గ బార్ ముందు ఓ పాన్‌షాపు ఉంది. అక్కడికి ఓల్డ్ నెరేడ్‌మెట్‌కు చెందిన సంట్రింగ్ కార్మికుడు బండారి రాము అనే వ్యక్తి పాన్ కొనుక్కునేందుకు వచ్చాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి పాన్ కోసం గట్టిగా అరుస్తున్నాడు. దీంతో రాములు కాస్త నెమ్మదిగా మాట్లాడాలని అవతలి వ్యక్తికి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త మాటమాట పెరిగింది.
ఆవేశంతో ఉన్న సదరు వ్యక్తి రాములుపై దాడి చేశాడు. రాయితో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఆరేళ్ల కుమారుడు, భార్య ఉన్నారు.