The Story Of Ashtavakra : గురువులను, పెద్దలను, మహర్షులను గేలి చేసిన పాపం ఊరకే పోదు. ఇలాంటి పాపానికి పాల్పడినవారు ఎన్ని జన్మలెత్తినా తగిన ఫలితం అనుభవించాల్సిందే! రావణాసురుడు మితిమీరిన అహంకారంతో ఒక మహర్షిని అవమానించి ఏ విధంగా తన చావును తానే కోరి తెచ్చుకున్నాడో ఈ కథనంలో చూద్దాం.
తండ్రి శాపంతో ఎనిమిది వంకరలతో పుట్టిన అష్టావక్రుడు
హిందూ సంప్రదాయానికి మహర్షులు మూలస్థంభాలు. అలాంటి గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని. జనక మహారాజుకు, యాజ్ఞవల్క్యుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే తన తండ్రి ఇచ్చిన శాపానికి గురవుతాడు. ఆయన మరణించాక స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేశాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా! అలాంటి మహర్షిని ఎగతాళి చేసి రావణాసురుడు ఏ విధంగా తన చావును తానే కోరి తెచ్చుకున్నాడో చూద్దాం.
రావణుని పాపాలే అతనికి శాపాలు
రావణుడు మహాభక్తుడు అయినప్పటికీ, మహాబలశాలిననే అహంభావంతో ఉండేవాడు. కనుక ఆయన చేసిన పనులే ఆయన ప్రాణాల మీదకి తెచ్చాయి. ఎంతో మంది మహర్షులను, సాధువులను హేళన చేయడం వలన ఆయన పొందిన శాపాలు, ఆయనను యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోయేలా చేశాయి.
అష్టావక్రునిపై రావణుని దుర్మార్గం
తండ్రి శాపంతో ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుడు, తపోబల సంపన్నుడవుతాడు. ఒకసారి ఆయన తన మానాన తాను వెళుతూ ఉండగా, వెనకగా రథంపై వస్తున్న రావణుడు అష్టావక్రుడి 'గూని'పై బలంగా కొడతాడు. అలా కొడుతూ 'వంకరలు సరి చేయమంటావా?' అంటూ హేళన చేస్తాడు.
రావణుడి చేష్టలకు కలత చెందిన అష్టావక్రుడు
రావణుడి చేష్టలు అష్టావక్రుడిని ఎంతగానో బాధిస్తాయి. దాంతో త్వరలో జరగనున్న యుద్ధంలో రావణుడి శరీరం పడిపోతుందనీ, కోతులు రావణాసురుని శరీరం తొక్కుతారని, దీనితో రూపం గుర్తుపట్టలేనంతగా రావణుని శరీరం మారుతుందని అష్టావక్రుడు శపిస్తాడు. రావణుడు ఆ శాపాన్ని తేలికగానే తీసుకుంటాడు. కానీ అష్టావక్రుడు శపించినట్టుగానే యుద్ధంలో రాముడి చేతిలో మరణించిన రావణుడి శరీరాన్ని వనరులు తొక్కి రూపాన్నే మార్చేస్తారు. చూశారుగా! బలం, అధికారం ఉందని పెద్దలను అవమానిస్తే చివరకు పతనం ఖాయమని ఈ కథ మనకు తెలుపుతుంది.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.