Chevella Road Accident Update : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ దగ్గర రోడ్డు పక్కన స్థానికులు కూరగాయలు విక్రయిస్తుంటారు. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం అంగడి సాగుతోంది. కూరగాయల వ్యాపారులు, కొనుగోలుదారులతో ఆప్రాంతం రద్దీగా ఉంది. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న లారీ, ఆలూరు స్టేజి వద్ద నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా దాటేందుకు యత్నించింది. అదే సమయంలో ఎదురుగా ఓ కారు రావడంతో దానిని తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ అమీర్ వాహనాన్ని పూర్తిగా కుడివైపునకు తిప్పాడు.
దీంతో వాహనం పూర్తిగా అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఒకరి తరవాత ఒకరిని తొక్కుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అక్కడ ఉన్నవారు గమనించే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రమాదంతో క్షతగాత్రులు సహాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. ఈ ప్రమాదంలో చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు, దామరగిద్ద కృష్ణ, నాంచేరి గ్రామానికి చెందిన శ్యామల సుజాత అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. టోలిచౌకీకి చెందిన జమీల్ చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో జమీల్ అనే యువకుడు కూరగాయలు కొనేందుకు వచ్చి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి : ప్రమాదంలో గాయపడిన వారిని పట్నం మహేందర్ రెడ్డి బోధనాసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో లారీ క్యాబిన్ ధ్వంసమై అందులో చిక్కుకున్నాడు. అతన్ని బయటకు తీయడానికి దాదాపు గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం 108 వాహనంలో అతడిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
యమలోక ద్వారంగా ఈ ప్రాంత రోడ్ : హైదరాబాద్ - బీజాపూర్ రోడ్ ప్రమాదాలకు అడ్డాగా మారిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదన్నారు. మన్నెగూడ నుంచి అప్పకోడెల వరకు 290 గుంతలు, 66 మూల మలుపులు, 19 డేంజరస్ స్పాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ రహదారిపై 2022లో 172 ప్రమాదాలు జరగ్గా 47 మంది మృతి చెందారు. 2023లో 101 ప్రమాదాలు జరగ్గా 55 మంది చనిపోయారు. 2024లో ఇప్పటివరకు 109 ప్రమాదాలు జరగ్గా 39 మంది దుర్మరణం చెందారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యేతో కలిసి ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరింత పరిహారం అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి ఈ జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలోనే ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. కాసేపట్లో ఇంటికి వెళ్లి తమ వారితో సంతోషంగా గడపాల్సిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - 8 మంది కూలీల దుర్మరణం - అందరిదీ ఒకే వీధి