Main Reasons for Separation of Husband and Wife : కుటుంబంతో హాయిగా, ఆనందంగా ఉండాల్సిన బంధాన్ని కొందరు విడిచి పెడుతున్నారు. సర్దుకుపోయే గుణం లేకుండాపోతుంది. వివాహ బంధాలను వీడి, పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకుంటున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పోయే సమస్యలకు సైతం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. వీరిలో యువ జంటలు సైతం ఉంటున్నాయి.
పోలీసులు ఏం గుర్తించారంటే?
- గృహ హింస నివారణ కేసులు రావడం
- ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయడంతో నేటి తరం సర్దుకోలేక గొడవలు పడటం
- ఆర్థిక సమస్యల కారణంగా దంపతులు విడాకులు తీసుకోవడం
- ఉమ్మడి కుటుంబంలో జీవించేందుకు కొందరు మహిళలు సుముఖత చూపించకపోవడం
90 శాతం కేసుల్లో దంపతుల మధ్య మనస్పర్థలకు కారణం సెల్‌ఫోన్లు, అపోహలు, అహం, మద్యం అలవాటు, అక్రమ సంబంధాలని పోలీసులు వివరిస్తున్నారు.
Relationship tips : అర్థం చేసుకుంటేనే అనుబంధం పదిలం
అహం : ఇంట్లో నా మాటే చెల్లుబాటు కావాలి. నేను లేకపోతే ఇళ్లే నడవదు. నేను చేసిన వంటే అంతా తింటున్నారు. నా కష్టంతోనే కుటుంబం నడుస్తోంది. ఇలా ఎవరికి వారు అహం ప్రదర్శించి బంధుత్వాలను తెంచుకుంటున్నారు. 'సారీ' చెబితే అయిపోయే విషయాలను సైతం అహంతో పోలీసుల వరకు తెచ్చుకుంటున్నారు.
అపోహలు : అపోహలు ఇద్దరి మధ్యం ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఏదో ఊహించుకుని ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడటం, చేయి చేసుకోవడం వంటి కారణాలతో తగాదాలు వస్తున్నాయి. ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోవాల్సింది పోయి, దెప్పి పొడవడం వల్ల గొడవలు జరుగుతున్నాయి.
సెల్‌ఫోన్ : భర్త ఎవరితోనో గంటల తరబడి మాట్లాడుతున్నాడని, భార్య ఫోన్‌లో తరచూ కొన్ని నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పే ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. వచ్చిన కేసుల్లో ఒక కారణం కచ్చితంగా ఫోన్ గురించి ఉంటుంది.
మద్యం : దంపతుల మధ్య గొడవల్లో మద్యం అనేది ప్రధాన కారణం. మద్యం తాగినప్పుడు భార్యను ఇష్టానుసారంగా మాట్లాడటం, కొట్టడం వల్ల గొడవలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల్లో మద్యం ఎక్కువ ప్రభావం చూపుతోంది.
వివాహేతర సంబంధాలు : భాగస్వామి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ఎవరూ తట్టుకోలేరు. ఏదో ఓ కారణంతో ఇతరులకు ఆకర్షితులవ్వడం వల్ల తగదాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరో మనిషితో సంబంధం పెట్టుకోవడంతో 75 శాతం గొడవలు జరుగుతున్నాయి.
దంపతులకు నిత్యం కౌన్సెలింగ్ : ఈ తరహా కేసులు ఏపీలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ పరిధిలోని గృహ సింహ నివారణ విభాగానికి వస్తున్నాయి. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలు రావడంతో పాటు ఆ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. పట్టుదలకు పోయి చిన్న సమస్యలను పెద్దగా చేసుకుంటున్నారని, ఇతరుల అనవసర జోక్యంతో భార్యాభర్తలు విడాకులు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారని కౌన్సెలర్లు, సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.