Travis Head About Jasprit Bumrah : ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ తాజాగా టీమ్ఇండియా స్టార్ పేసర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా లాంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నానని తాను తన మనవళ్లకు చెబుతానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బౌలర్లలో ఒకడిగా బుమ్రా తన కెరీర్‌ను ముగిస్తాడు. అతడ్ని ఎదుర్కోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో మేము చూస్తున్నాం. కానీ తనతో ఆడటం చాలా బాగుంది. ఒకసారి మన కెరీర్ ముగిశాక ఆలోచించుకుంటే అతణ్ని నేను ఎదుర్కొన్నాను అని నా మనవళ్లకు చెప్పుకోవడం నాకు చాలా బాగుంటుంది. బుమ్రాతో ఆడే సిరీస్ ఏదీ బాగాలేదని అనిపించదు. అతడ్ని ఇంకా ఎక్కువసార్లు ఎదుర్కోవాలి. కానీ ప్రతిసారీ అది సవాలుగానే అనిపిస్తుంది" అని హెడ్ చెప్పుకొచ్చాడు.
పెర్త్ టెస్టులో తన అద్భుతంగా బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన తీరే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను 295 పరుగులతో చిత్తు చేసిన విషయంలో ప్రధాన ఘనత బుమ్రాదే. తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యంతో వెనుకబడ్డ టీమ్ఇండియాను తన బౌలింగ్ స్కిల్స్‌తో పైచేయి సాధించేలా చేశాడు. పేస్, స్వింగ్ కలగలిపి అతను సంధించిన బంతులకు ఆస్ట్రేలియా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. ఊహించని ఈ దాడికి బిక్కచచ్చిపోయింది కమిన్స్ సేన. ఇక ఆ జట్టు మ్యాచ్‌లో పుంజుకోవడానికి అవకాశమే లేకపోయింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ కూడా అయిన బుమ్రా, తన పెర్ఫామెన్స్‌తో జట్టులో కీలక పాత్ర పోషించాడు. దీంతో బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎంతో పట్టుదలతో ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు.రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనూ బుమ్రా కొట్టిన దెబ్బతో ఆసీస్ కోలుకోలేకపోయింది. దీంతో ఘనవిజయం భారత్ సొంతమైంది.
మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు (డే/నైట్)లో బుమ్రా నుంచి మరింతగా ఆసీస్ బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతడి బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ జట్టు బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు. అతణ్ని ఎదుర్కోవడం మీదే ఆసీస్ ఆలోచనలు, ప్రణాళికలు తిరుగుతున్నాయని తెలుస్తోంది.
సిరాజ్‌కు బుమ్రా టిప్స్- ఒక్క మాటతోనే 5 వికెట్లు తీశాడంట!
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల జోరు - టాప్‌లోకి బుమ్రా, జైస్వాల్