Commercial Tax Income in Telangana : రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం నవంబర్ నెలలో భారీగా పెరిగింది. జీఎస్టీ రాబడితో పాటు పెట్రోల్, డీజిల్, లిక్కర్ అమ్మకాలపై వ్యాట్ ఆదాయంలోనూ వృద్ధి కనిపించింది. గత ఏడాది నవంబర్ రాబడి కంటే రూ.780 కోట్లు అదనంగా వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన ఎనిమిది నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.47,719 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
రాష్ట్రంలో వాణిజ్య పన్నులశాఖ రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి నెలల వారీగా వచ్చిన రాబడుల్లో అక్టోబర్‌లో ఆదాయం భారీగా పడిపోయింది. 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రాబడితో పోలిస్తే ఏకంగా రూ.1607 కోట్లు తగ్గింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు శాఖాపరంగా తనిఖీలు ముమ్మరం చేయడం, రిటర్న్‌లు వేసేటట్లు వ్యాపారులపై ఒత్తిడి పెంచడం, బోగస్ సంస్థల ద్వారా తీసుకుంటున్న రీఫండ్‌లకు అడ్డుకట్ట వేయడం, పాత బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవడం వంటి చర్యలతో ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు. తిరోగమనం నుంచి పురోగమనం వైపు వాణిజ్య పన్నుల శాఖ వెళ్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాలనాపరమైన లోపాలను సరిదిద్దడం వల్లనే నవంబర్ నెలలో ఆదాయం పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
నవంబరులో 14శాతం వృద్ధి : 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ.70,720 కోట్ల వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.85,112 కోట్లు రాబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల్లో రూ.47,719 కోట్ల ఆదాయం వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. గతేడాదిలో ఎనిమిది నెలల రాబడితో పోలిస్తే దాదాపు రూ.2000 కోట్లు అధికమని వెల్లడించారు. నవంబర్ నెలలో అత్యధికంగా 14శాతం వృద్ధి కనబరిచినట్లు వెల్లడించారు.
ఇక పెట్రోల్, డీజిల్ విక్రయాల ద్వారా వ్యాట్ రాబడి రూ.1,302 కోట్లు, మద్యం విక్రయాలపై వ్యాట్ ఆదాయం రూ.1,180 కోట్లు ప్రొఫెషనల్ ట్యాక్స్, పాత బకాయిలు కలిసి మొత్తం రూ.2,545.57 కోట్లు రాబడి వచ్చి పదిశాతం వృద్ధి నమోదు చేసింది. వ్యాట్, జీఎస్టీ రెండు కలిసి నవంబర్ నెలలో రూ.6249 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే ఈ ఆర్థిక ఏడాదిలో రూ.72 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి మూడు నెలల్లో అత్యధికంగా పన్నులు రాబడులు వస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ రూ.80వేల కోట్లు ఆదాయం వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు కడుతోంది.
Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక
Telangana Tax Income May : రాష్ట్రంలో పెరిగిన పన్నుల రాబడి.. 'మే'లో ఎంతంటే..?