Snake Catcher Special Story : పాములను చూస్తే చాలు భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ హనుమకొండకు చెందిన పుట్టా జయకర్ మాత్రం భయపడడు సరికదా వాటిని అవలీలగా పట్టేస్తాడు. పామొచ్చిందని ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెంటనే వచ్చి ఆ పామును పట్టేస్తాడు. ఇలా పట్టిన వాటికి ఏమాత్రం హాని చేయకుండా దూరంగా అడువుల్లో వదిలేస్తాడు. అలా వేలాది పాములు పట్టి రికార్డు నెలకొల్పాడు.
ఏ పామునైనా ఇట్టే పట్టేయడం వెన్నతో పెట్టిన విద్య : హనుమకొండ జిల్లా సుబ్బయ్యపల్లికి చెందిన జయకర్ వృత్తి ఎలక్ట్రీషియన్. అప్పుడప్పుడు మేజిషియన్‌గా మారి ప్రదర్శనలు ఇస్తారు. కానీ ప్రవృత్తి మాత్రం ఇదిగో ఇదే. ఏ పామునైనా ఇట్టే పట్టేయడం జయకర్ వెన్నతో పెట్టిన విద్యే. పట్టేటప్పుడు చాలా నేర్పుగా వాటికి ఎలాంటి గాయం కాకుండా చూస్తారు. ఓసారి కొందరు పామును పట్టి చంపేయడం చూసి ఆవేదన చెంది తనకు తాను.. సొంతంగా పాములను పట్టడం నేర్చుకున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఇక అప్పటి నుంచి పాములు పట్టడం మొదలుపెట్టారు.
ఇళ్లల్లోకి, ఇంటి ఆవరణలోకి పాములు రావడం సహజమే. ఇలా వచ్చినవారంతా జయకర్‌కు ఫోన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వచ్చి పాములు పట్టేస్తాడు. ఇలా పట్టినందుకు రూపాయి కూడా డిమాండ్ చేయడు. ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటి వరకు వేలాది పాములను పట్టాడు. సామాన్యుల ఇళ్లలోనే కాదు వీఐపీల ఇళ్లల్లోనూ వందల సంఖ్యలో సర్పాలను పట్టేశాడు.