Special Story On Curry Points In Villages : 'ఊరు నుంచి అమ్మ, అక్కాబావ వచ్చారు. ఏం కూర చేద్దాం? పక్క వీధిలో ఉన్న కర్రీ పాయింట్‌లో రెండు ఫ్రై కర్రీస్, ఒక సాంబారు, ఓ పెరుగు ప్యాకెట్ కొనుకొచ్చేయ్ అందరికీ సరిపోతాయ్. ఏవండీ.. టౌన్ నుంచి వచ్చేటప్పుడు లంచ్‌కు ఒక క్యాబేజీ వేపుడు, పప్పు తీసుకొచ్చేయండి అన్నం పెట్టేస్తా’ ఈ మాటలు ఒకప్పుడు పట్టణాల్లోనే వినిపించేవి. ఈ మాటలు ఇప్పుడు పల్లెటూళ్లలోనూ వినిపిస్తున్నాయి. సాధారణంగా కర్రీ సెంటర్లు అనగానే మనకు పట్టణాలే గుర్తుకువస్తాయి. అదంతా ఒకప్పుడు. ప్రస్తుతం పల్లెటూళ్లలోనూ ఈ కల్చర్ క్రమంగా విస్తరిస్తోంది.
గ్రామాల్లో విస్తరిస్తున్న కర్రీ పాయింట్ కల్చర్ :కొంతమంది మండల కేంద్రాల నుంచో, లేదంటే పట్టణాల నుంచో తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కర్రీలను కొనుగోలు చేసుకుని తీసుకుపోతున్నారు. మరికొన్ని చోట్ల గ్రామాల్లోనూ వండిన కూరలు లభ్యమవుతున్నాయి. ఈమధ్య కాలంలో పలు పల్లెల్లోనూ ఈ కర్రీ పాయింట్ల వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. మరికొందరికి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు మండల కేంద్రాల్లో కర్రీ పాయింట్లు ఉండగా, ఇప్పుడు క్రమంగా గ్రామాల్లోనూ విస్తరిస్తున్నాయి. దీంతో చాలామంది మహిళలు సొంతూరిలో స్వయం ఉపాధిని పొందుతున్నారు.
సాధారణంగా గ్రామాల్లో ఉదయం టిఫిన్స్ లాంటివి ఎవరి ఇళ్లల్లో వారే చేసుకునేవారు. టీ, కాఫీలు ఇంట్లోనే తాగేవారు. అలాంటిది ఇప్పుడు పల్లెల్లో టిఫిన్, టీ దుకాణాలు వెలిశాయి. తాజాగా కర్రీ పాయింట్లను కూడా కొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అంటే చివరకు లంచ్‌కు కూరలు కూడా వండుకోవడం లేదని అర్థమవుతోంది.
బయట కూరలు కొనడానికి గల కారణాలు :
- కూలీ పనులకు వెళ్లే వారికి సమయం తక్కువగా ఉండటం
- రోజంగా డ్యూటీ చేసి వచ్చి వండుకోవాలంటే కష్టంతో కూడుకున్నది కావడం
- మరోవైపు మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటం.
ఒంటరిగా ఉండే వారిని ఆదుకుంటున్నాయి : ఒకప్పుడు పల్లెలోని ఇళ్లకు బంధువులు ఇంటికి వస్తే ఇంట్లోనే సొంతంగా వంటలు వండి వార్చేవారు. నేడు గ్రామాల్లో కూడా ఇంటికొచ్చిన వారికి సొంతంగా కర్రీలు తయారు చేసి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లకు బంధుమిత్రులు వస్తే, వెంటనే కర్రీ పాయింట్‌కు వెళ్లి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. సమయం లేక కొందరు, కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల వృద్ధులు వయోభారంతో, చదువు నిమిత్తం పిల్లలు ఎక్కడో ఉంటే ఒంటరిగా ఉండే తల్లిదండ్రులు, ఇలా పట్టణ ప్రజలతో పాటు పల్లె వాసులు కూడా నేడు కర్రీ సెంటర్ల వద్ద క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఏ గ్రామంలో చూసినా కూరల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పల్లెల్లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కు ఇదొక మంచి అవకాశంగా మారింది.
క్రమంగా పెరుగుతున్న కర్రీ సెంటర్లు :ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గ్రామగ్రామాల్లో కర్రీ సెంటర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో చాలామంది మహిళలు సొంతూరిలో స్వయం ఉపాధిని పొందేందుకు అవకాశం ఏర్పడుతోంది. మొదట్లో వైట్‌రైస్‌తో పాటు కొద్దిగా కర్రీ ప్యాకెట్లు తయారు చేసి అమ్మేవాళ్లమని రవ్వారం గ్రామానికి చెందిన కర్రీ పాయింట్ నిర్వాహకురాలు వెల్లడించారు. వీటికి క్రమంగా ఆదరణ పెరిగి, ప్రజలు కూరలు కావాలని అడుగుతున్నారని చెప్పారు.
దీంతో ఇప్పుడు తమతో పాటు మరో ఇద్దరు పని వాళ్లను కూడా పెట్టుకుని తయారు చేయిస్తున్నామని కర్రీ పాయింట్ నిర్వాహకలు తెలిపారు. మొదట్లో ప్యాకెట్టు రూ.10కి అమ్మే వాళ్లమని, కూరగాయల ధరలతో పాటు నిత్యావసర సరకుల ధరలు కూడా అమాంతం పెరగడం వలన రూ.20కి పెంచామని వివరించారు. తమ ఊరికి చుట్టుపక్కల 10 పల్లెటూర్లు ఉన్నాయని, వారంతా ఉదయం, సాయంత్రం వచ్చి కొంటున్నారని రామలక్ష్మి తెలిపారు.
నాన్‌వెజ్ స్పెషల్ : టేస్టీ టేస్టీ మ్యాంగో మటన్ కర్రీ.. ఒక్కసారి తిన్నారంటే వావ్ అనాల్సిందే - MANGO MUTTON CURRY RECIPE IN TELUGU
ఎగ్ లేకుండా అద్దిరిపోయే "ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం! - How To Make Veg Bread Omelette