Electrical Shock Protections :నిత్యం ఎక్కడ చూసినా తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాలు వైర్లను ఎలుకలు కొరకడం వల్లనో, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మిక్సీలు, ఇస్త్రీ పెట్టెలు, గ్రైండర్లు, గీజర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కాలిపోవడం వంటివి చూస్తున్నాం. అలాగే వ్యవసాయ మోటార్లు కాలిపోవడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో మనుషులు, జంతువులు తీవ్రంగా గాయపడటం గానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ సర్వసాధారణం అయిపోయింది. మరీ ముఖ్యంగా వర్షాల సమయంలో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. అందుకే ఇలాంటి కరెంట్ షాకుల వల్ల జరిగే ప్రమాదాల నుంచి రక్షించేందుకు ప్రత్యేక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పేర్లతో అమ్ముడవుతున్నాయి.
రకాలు :
- ఎర్త్ లీకేజ్ సర్య్కూట్ బ్రేకర్ (ఈఎల్‌సీబీ)
- రెసిడ్యుయల్ కరెంట్ డివైజ్ (ఆర్‌సీడీ)
- రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ (ఆర్‌సీసీబీ)
- గ్రౌండ్ ఫాల్ట్ సర్య్కూట్ ఇంటర్రప్టర్ (జీఎఫ్‌సీఐ)
ఇంటిని భద్రంగా కాపాడుకోవచ్చు :గృహాలతో పాటు, లో టెన్షన్ విద్యుత్తు వినియోగదారులు ఈ పేర్లతో పిలిచే పరికరాలను తమ సర్వీసు కనెక్షన్లకు కలిపి ఉంచితే విద్యుత్ ప్రమాదాలు నివారించవచ్చని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. వీటికి ఉండే ప్రత్యేకత ఏంటంటే స్వల్ప విద్యుదాఘాతం జరగ్గానే, వెంటనే ఈ పరికరం స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్ సప్లయి అనేది నిలిచిపోతుంది. తద్వారా ఇంటి మొత్తం విద్యుత్ ఘాతానికి గురి కాకుండా రక్షణ దొరుకుతుంది. మళ్లీ స్విచ్ ఆన్ చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా కట్టే ప్రతి ఇంట్లోనూ ఈ సేఫ్టీ పరికరాల్లో ఏదో ఒకటి ఉపయోగిస్తున్నారు.