Son Killed Father In Mancherial District :ఎదుగుతున్న తమకు మంచిచెడ్డలు చెప్పాల్సిన తండ్రే తప్పుదోవపట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తమ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి వ్యసనాలకు బానిసకావడంతో ఆవేశానికి లోనయ్యారు. జన్మనిచ్చిన తండ్రినే కడతేర్చి చిన్నవయసులోనే నేరస్థులుగా మారిపోయారు. మంచిర్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ ఘటనలు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య(45) అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తల్లితో తండ్రి తరచూ గొడవ పడుతున్నారని గొంతుకోసి చంపి :రాజయ్య వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజయ్య భార్య భాగ్యలక్ష్మి నస్పూరులోని తన సోదరుడి ఇంటికి కుమారుడైన సాయి సిద్ధార్థతో కలిసి వెళ్లారు. ఎంత చెప్పినప్పటికీ తండ్రి ప్రవర్తనలో మార్పురావడంలేదని, తల్లితో తరచూ గొడవపడుతున్నాడని కోపోద్రిక్తుడైన సాయి సిద్ధార్థ(18) గురువారం అర్ధరాత్రి తన స్నేహితులు వినయ్, సందీప్‌తో కలిసి మద్యం సేవించి ఇందారంలోని తండ్రి వద్దకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజయ్య గొంతుకోశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.