Electricity Meters Burning With Electrical Load In TG : విద్యుత్ మీటర్లలో లోపాల వల్ల ప్రజలు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై ఆర్థికభారం పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు సగటున 2 వేల మీటర్ల వరకు కాలిపోవడమో లేదా సాంకేతిక సమస్యలతో మొరాయించడమో జరుగుతోంది. గతేడాది(2023-24) విద్యుత్ పంపిణీ సంస్థలు ఇలాంటివాటిని మార్చి 7,05,820 కొత్త మీటర్లు అమర్చాయి. ఈ ఏడాది(2024-25) తొలి ఆర్ధభాగంలోనూ దాదాపు మూడు లక్షల కరెంట్ మీటర్లను మార్చాయి.
రాష్ట్రంలో అత్యధికంగా మెదక్ జిల్లాలో : రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కం పరిధిలోని పరిశ్రమలతో పాటు, గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్నందు వల్ల ఇక్కడ మీటర్లు కాలిపోవడమనేది అధికంగా ఉంది. గతేడాది రాష్ట్రంలో 2.10 లక్షల మీటర్లు కాలిపోగా అందులో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే 1,63,915 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మెదక్ జిల్లాలో 37,510, నల్గొండలో 31,695 మీటర్లు గతేడాది కాలిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పరిధిలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న బంజారాహిల్స్, సైబర్‌సిటీ విద్యుత్ సర్కిళ్లలోనే ఏకంగా ఎనిమిది వేలు కాలిపోగా, మరో 25వేలకు పైగా సాంకేతిక సమస్యలతో పనిచేయకపోవడంతో మార్చాల్సి వచ్చింది. ఒక విద్యుత్ మీటరు కాలిపోతే వినియోగదారు రూ.2 వేల వరకూ కట్టాల్సి ఉంటుంది. సాంకేతికంగా మొరాయిస్తే మాత్రం డిస్కంలే ఉచితంగానే మారుస్తున్నాయి. ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడుతోంది.
అసలు ఎందుకీ సమస్యలు : ప్రధానంగా ఓవర్‌లోడ్ వల్లనే మీటర్లు కాలుతున్నాయని, చాలాచోట్ల పనిచేయకుండా ఆగిపోతున్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలించిన విద్యుత్‌శాఖ సిబ్బంది వివరించారు. విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రి నాసిరకమైనవి ఉపయోగించడం వల్ల మీటర్లు ఎక్కువగా కాలుతున్నట్లుగా గుర్తించారు. తక్కువ లోడు సామర్థ్యంతో మీటర్లు తీసుకుని ఎక్కువ కరెంటును వినియోగించడంతో పాటు, నాణ్యతలేని సర్వీసు వైర్లను మార్చకుండా వాడుతూ ఉండడం లాంటివి ఇతర కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల ఇళ్లలో, వాణిజ్య సంస్థల్లో కరెంటుతో నడిచేటువంటి ఉపకరణాల సంఖ్య చాలా అధికంగా ఉంటోంది. దీనివల్ల కరెంట్ లోడు అనూహ్యంగా పెరుగుతోంది.
ఉదాహరణకు ఈ నెల 22న తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండు 14,785 మెగావాట్లుగా నమోదైంది. జనవరి నెలలోనే రోజువారీ డిమాండు ఈ స్థాయిలో నమోదవడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి. చలికాలంలో కరెంట్ డిమాండు ఇలా అధికం కావడానికి అన్ని వర్గాల కనెక్షన్లకు కరెంటు వినియోగం అధికంగా ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పట్టణాలనే కాకుండా పల్లెల్లో సైతం లోడు విపరీతంగా పెరుగుతోంది. అధికంగా గ్రామీణ ప్రాంతాలున్నటువంటి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గతేడాది మీటర్లు ఎక్కువగా కాలిపోయినట్లుగా విద్యుత్ సిబ్బంది గుర్తించారు.
మీటర్ల ట్యాంపరింగ్ అంటే ఇదేనేమో భయ్యా - ట్రిపుల్ బెడ్రూం ఇంటికి కరెంట్ బిల్ రూ.72!
చలికాలంలోనూ కరెంట్ బిల్ ఎక్కువ వస్తోందా? - మీకూ ఇలాగే జరుగుతుందేమో చెక్ చేసుకోండి