తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికాలో అమ్మ భాష - విదేశీ గడ్డపై వికసిస్తున్న అఆఇఈ - NRI KIDS LEARING TELUGU IN USA - NRI KIDS LEARING TELUGU IN USA

NRI Kids Learning Telugu In America : విదేశాల్లోనూ మాతృభాష ప్రకాశిస్తోంది. తెలుగు వాళ్లు వారి పిల్లలకు మాతృభాషను ఒంటపట్టిస్తున్నారు. సిలికానాంధ్ర, తానా వంటి సంస్థలు సైతం విదేశాల్లో మన తెలుగుభాషను పరిరక్షించేందుకు పాటుపడుతున్నాయి. ఆయా సంస్థల కృషితో మన సంస్కృతి పరిఢవిల్లుతోంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మననం చేసుకుందాం.

Children Learning Telugu in America
Learning Mother Tongue in Abroad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 10:06 AM IST

Updated : Aug 29, 2024, 10:27 AM IST

NRI Kids Learning Telugu In America :అమెరికా ఒడిలో మన తెలుగు పిల్లలు అ ఆ ఇ ఈలు దిద్దుతూ పదాలు పలుకుతున్నారు. తెలుగు పాటలు, పద్యాలు పాడుతున్నారు. ''ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలపరా నీ జాతి నిండు గౌరవము’’ అన్న రాయప్రోలు సుబ్బారావు స్ఫూర్తిని వీరు పరిమళింపజేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్లి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు మూలాలను మరిచిపోకుండా తమ పిల్లలకు మాతృభాషను ఒంటపట్టిస్తున్నారు. సింగపూర్​ తదితర దేశాల్లోనూ ఈ కృషి కొనసాగుతోంది. నేడు(ఆగస్టు 29) తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం.

మన తెలుగుభాషను పరిరక్షించేందుకు సిలికానాంధ్ర, తానా వంటి సంస్థలు విదేశాల్లో పాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిలికానాంధ్ర 2007 నుంచే 'మనబడి’ పేరిట మాతృభాషాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తోంది. అమెరికాలోని 33 రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల్లోని విద్యార్థులకు కూడా మన భాష, సంస్కృతులను నేర్పిస్తున్నారు. ముఖ్యంగా చదవడం, రాయడం, వినడం, మాట్లాడటం ఈ నాలుగు అంశాలపై దృష్టి పెడుతుంటారు. శని, ఆది వారాల్లో క్లాసులు జరుగుతుంటాయి. 2500 మంది వరకు భాషా సైనికులు (ఉపాధ్యాయులు) స్వచ్ఛందంగా పాఠాలు చెబుతున్నారు. 2007లో 333 మందితో మొదలైన మనబడిలో ప్రస్తుతం 14 వేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు.

తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల (ETV Bharat)

చిన్నపిల్లలకు ఆటపాటలతో భాషను బోధిస్తుండగా కొంచెం పెద్ద పిల్లలకు వ్యాకరణం, అనువాదం, పద, వాక్య నిర్మాణాలు తదితరాలపై పాఠాలు చెబుతున్నారు. పద్యాలు, శతకాలు కూడా రచించేలా శిక్షణ ఇస్తున్నారు. పదరంగం పూర్తిగా తెలుగులో మాట్లాడటం చదువుతో పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేస్తున్నారు. శిక్షణ అనంతరం పిల్లలకు పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ధ్రువపత్రాలను ఇస్తారు. అంతేకాకుండా స్నాతకోత్సవాలూ నిర్వహిస్తారు. పిల్లలు ఆన్‌లైన్‌లో సైతం నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.

'మన బడి కార్యక్రమాలు దాదాపు 10 దేశాల్లో నిర్వహిస్తున్నాం. గత 17 ఏళ్లుగా దాదాపు లక్ష మంది విద్యార్థులు తెలుగు భాష నేర్చుకున్నారు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి'- రాజు చామర్తి, మనబడి అధ్యక్షుడు

20 రాష్ట్రాల్లో తానా పాఠశాల : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి '‘పాఠశాల'’ పేరుతో మాతృభాషను నేర్పుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు అయిదు వేల మంది తెలుగు భాష నేర్చుకుంటున్నారు. అమెరికాలోని 20 రాష్ట్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్నెట్​ వేదికగా తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలకు మాతృభాష నేర్పించి తరాల మధ్య వారధిని నిర్మించే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నామని తానా పాఠశాలు అధ్యక్షుడు మాగులూరి భానుప్రకాశ్‌ ఈటీవీ భారత్​కు వివరించారు.

సింగపూర్‌లో ఆన్‌లైన్‌ తరగతులు :సింగపూర్‌లో సుమారు పదివేల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. అక్కడ కూడా మనవాళ్లు వారి పిల్లలకు ఆన్​లైన్​ ద్వారా మాతృభాష నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు వారికి పాఠాలు బోధిస్తున్నారు. సింగపూర్‌లో తమిళం, మలయాళం, హిందీ పాఠశాలలు ఉన్నాయని, తెలుగు బడులు కూడా నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని సింగపూర్‌ కాకతీయ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు పాతూరి రాంబాబు, సభ్యుడు గూడూరి శేషారావు ఈటీవీ భారత్​కు తెలిపారు.

Last Updated : Aug 29, 2024, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details