Change In BTech Syllabus in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్ష మందికి పైగా పట్టభద్రులు అవుతున్నారు. కానీ వీరిలో 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కారణం ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యాలు పెంచే పాఠ్యాంశాలు సిలబస్‌లో లేకపోవడం. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చాలని అనుకుంటున్నారని జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. రెండు నెలల్లో సిలబస్‌లో మార్పులు, చేర్పులు పూర్తి కానున్నాయని, కొత్త సిలబస్‌ను ప్రభత్వం ఆమోదంతోనే అమలు చేయనున్నామని వివరించారు.
వాళ్ల సలహాలు సూచనలు తీసుకొని మార్పులు : కొత్తగా రూపొందించనున్న సిలబస్‌పై మాట్లాడిన ఆయన విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలతో పోటీ పడేలా ఉంటుందని తెలిపారు. దీనిపై ఇప్పటికే వందల మంది విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకున్నామన్న ఆయన, ఇంజినీరింగ్ విద్యా ప్రమామాల పెంపుపై ఐఐటీ మద్రాస్ అధికారుల సహాకారంతో బుధ, గురువారాల్లో వర్క్‌షాప్ నిర్వహించినట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి 20 మంది ఉపకులపతులు, 200 మంది విద్యావేత్తలు హాజరయ్యారని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు రూపొందించాల్సిన ప్రమాణాలపై సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. వాటన్నింటిని క్రోడీకరించి సిలబస్ రూపకల్పనలు వినియోగిస్తున్నామని వివరించారు.
అందుబాటులో రీడిండ్ మెటీరియల్ : సిలబస్‌లో సమూల మార్పుల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు వారికి రీడింగ్ మెటీరియల్ అందించనున్నారని విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానానికి కార్యాచరణ రూపొందించామని వివరించారు.
విద్యతో పాటు కంపెనీలతో శిక్షణ : టీసీఎస్‌తో పాటు మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయా సంస్థలు శిక్షణ ఇవ్వనున్నాయని తెలిపారు. మూడో, నాలుగో సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు లభించేలా ప్రోత్సాహం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రణాళికలు, కార్యాచరణలు కార్యరూపం దాలిస్తే రెండు, మూడేళ్లలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 25 శాతం వరకు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు బాలకిష్టారెడ్డి వివరించారు.