Karun Nair Comeback : 'డియర్ క్రికెట్ నాకు మరో ఛాన్స్ ఇవ్వు' అంటూ భారత ఆటగాడు కరుణ్ నాయర్ గతంలో చేసిన ట్వీట్ ఇది. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ 8 మ్యాచ్‌లకే కనుమరుగైపోయాడు. ఆ తర్వాత అతడికి ఎలాంటి అవకాశాలు రాలేదు. గత 8ఏళ్లుగా కరుణ్ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. కానీ, ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్లో అతడు రెచ్చిపోతున్నాడు.
2024-25 విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో విదర్భకు నాయకత్వం వహిస్తున్న కరుణ్ వరుసగా నాలుగు, ఓవరాల్‌గా ఐదు సెంచరీలు బాది సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో ఔట్ కాకుండా 600+ పరుగులు చేసి, రాబోయే సిరీస్‌ల కోసం తనను పరిగణనలోకి తీసుకోవాలంటూ సంకేతాలు పంపుతున్నాడు. దీంతో 2022లో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తాజాగా వైరల్‌గా మారింది.
ఇక డొమెస్టిక్‌లో అదరగొడుతుండడం వల్ల సెలక్టర్లపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. దేశవాళీలో నిలకడగా రాణించడం అంత ఈజీ కాదు, ఇలాంటి ఆటగాడికి టీమ్ఇండియాలో చోటు కల్పించాలంటూ క్రీడా నిపుణులు కూడా చెబుతున్న మాట. ప్రస్తుతం అదిరే ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ పట్ల సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
రోహిత్, విరాట్‌కు ఎఫెక్ట్!
ప్రస్తుతం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి తాను రెడీ అన్నట్లు కరుణ్ తాజాగా డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్తో చెప్పకనే చెబుతున్నాడు. దీంతో బయటి నుంచి కూడా అతడిని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లపై వేటు వేసి కరుణ్‌ను తీసుకుంటారా? అన్న విషయం చర్చనీయాంశమైంది.
కేవలం అదే చేశా
అయితే రెండేళ్ల కిందట ఎమోషనల్‌తో ఆ పోస్ట్ షేర్ చేసినట్లు కరుణ్ చెప్పాడు. '7 నెలలు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. రోజూ మూడు గంటలపాటు ప్రయాణించి ప్రాక్టీస్ మాత్రమే చేసేవాడిని. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. ఏ ఫార్మాట్‌కూ నన్ను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ, వాటన్నింటిని పక్కనపెట్టే ముందుకుసాగాను. ఎప్పుడు అవకాశం వచ్చినా, నా సత్తా చూపించేందుకు రెడీగా ఉన్నా' అని నాయర్ వెల్లడించాడు.
🚨 Record Alert 🚨
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2025
Vidarbha captain Karun Nair has now hit the joint-most 💯s in a season in the #VijayHazareTrophy, equalling N Jagadeesan's (2022-23) tally of 5 centuries! 😮
📽️ Relive his fantastic knock of 122* vs Rajasthan in quarterfinal 🔥@IDFCFIRSTBank | @karun126 pic.twitter.com/AvLrUyBgKv
డియర్ క్రికెట్.. మరొక్క ఛాన్స్ ఇవ్వు.. అభిమానులను కదిలించిన ఆటగాడి ట్వీట్!