3 Days Sankranti Celebrations at Shilparamam : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఉపాధి, ఉద్యోగ, విద్య నిమిత్తం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నగరానికి వచ్చిన లక్షలాది మంది సొంతూళ్లకు పయనమవుతుంటారు. హైదరాబాద్లోనే స్థిరపడిన వారు, స్థానికులు మాత్రం ఇక్కడే సంబురాలు చేసుకుంటుంటారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
శిల్పారామంలో పల్లె వాతావరణం : సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, హరిదాసులు. ఇవన్నీ పండుగ పూట పల్లెల్లో కనిపించే అందాలు. పండుగ అంటేనే పట్టణ జనాభా పల్లె బాట పడుతుంది. ఇక్కడే ఉన్న వారికి కూడా పల్లెటూళ్ల వాతావరణం చూపించేందుకు హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామం సిద్ధమైంది. నిర్వాహకులు 3 రోజుల పాటు సంక్రాంతి సంబురాలు పల్లె వాతావరణంలో జరుపుతున్నారు.
శిల్పారామంలో ఆదివారం నుంచే సంబురాలు మొదలయ్యాయి. శిల్పారామంలోని పల్లె వాతావరణాన్ని తలపించే సెట్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, జంగమ దేవరులు, బుడబుక్కల, జానపద నృత్యాలు సందర్శకులను అలరించనున్నాయి. భోగి పండుగను పురస్కరించుకొని చిన్న పిల్లలకు 'భోగిపళ్ల ఉత్సవం' నిర్వహించారు.
ఇవే కాకుండా ఇక్కడకి వచ్చే జనాల కోసం చేనేత వస్త్రాలతో పాటు పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. తక్కువ ధరతో మంచి మంచి వస్తువులు అందుబాటులో ఉండటంతో సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు. పండుగ పూట ఊళ్లకు వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చి ఉన్న వాటిని చూస్తే తమ ఊరును చూసినట్టే ఉందని చెబుతున్నారు.
ఈ నెల 17 వరకు రోజూ సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు వివరించారు. తెలుగు స్టాండప్ కామెడీ, కోల్డ్ ప్లే, శిల్పకళా వేదికలో పౌరాణిక గాథల ప్రదర్శన, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ తదితర థియేటర్లలో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
పరేడ్ మైదానంలో కైట్, స్వీట్ ఫెస్టివల్-2025 :
- సాంస్కృతిక, రవాణా శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్-2025 నిర్వహిస్తున్నారు.
- ఇతర రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా, ఇటలీ, చైనా, సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక తదితర 20 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ వివిధ రకాల పతంగులు ఎగరేయనున్నారు. రాత్రిళ్లు కూడా కనిపించే తారాజువ్వల్లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేస్తాయి.
- దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ సిటీలో స్థిరపడ్డారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వందల మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శించనున్నారు. ఫుడ్ ఫెస్టివల్‌లో వంటకాలు నోరూరించనున్నాయి.
ఈసారి భోగి ఎంతో ప్రత్యేకం - 110 ఏళ్లకు ఒకసారి ఇలా! - మంటల్లో ఇవి దహనం చేసేద్దాం!
సంక్రాంతి స్పెషల్ "డ్రైఫ్రూట్స్ కజ్జికాయలు" - ఇలా చేయండి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!