Sankrati Festival Train and Bus Ticket Prices : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణానికి మాత్రం భారీ ఖర్చు అవ్వడం తప్పడం లేదు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా, ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి పరిస్థితి ఏర్పడింది. విమాన టికెట్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారు. సంక్రాంతికి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలనే నేపథ్యంలో ప్రజలు సిద్ధమవుతుండటంతో ఇదే అదనుగా ఛార్జీలను పెంచేస్తున్నారు.
ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్ఠంగా రూ.7వేలకు పైగా టికెెట్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు రూ.2,300, మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. పండుగకు ముందు మూడురోజులు జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది.
‘ప్రైవేటు’లో బాదుడు! :సంక్రాంతి పండుగ దగ్గరకొస్తున్న కొద్దీ ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేవారు సౌకర్యంగా ప్రయాణం చేయడానికి స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్ బెర్తులకు, కొన్ని బస్సుల్లో ముందువరుస సీట్లకు కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు.
జనవరి 12న హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సులో టికెట్ ధర రూ.6,999, జీఎస్టీ రూ.349.95 కలిపి మొత్తం రూ.7,348.95 వసూలు చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు బస్సుల డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ఆపరేటర్లూ కూడా అదనపు బస్సులు నడుపుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు జనవరి 13న ఆర్టీసీ స్లీపర్ బస్సులో సీటు టికెట్ ధర రూ.810. అదే ప్రైవేట్ బస్సులో ఛార్జి రూ.1,200. తేడా సుమారుగా రూ.400గా ఉంది. స్లీపర్ బెర్తు టికెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో రూ.1,040 అయితే, ప్రైవేటు బస్సులో ధర రూ.2,300. ఏకంగా డబుల్‌గా ఉంది. మంచిర్యాలకు ఆర్టీసీ బస్సులో బెర్తు ధర రూ.860 అయితే ఓ ప్రైవేట్ బస్సులో ఏకంగా భారీ స్థాయిలో రూ.3,700గా నిర్ణయించారు.