Safety Tips For Swimming in Telugu :ఈత అంటే ఎవరికి సరదా ఉండదు చెప్పండి. చిన్నా,పెద్దా అంతా చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా ఒక్కసారైన ఈత కొట్టాలని భావిస్తుంటారు. అయితే ఈ సరదా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా ప్రాణాల మీదికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా చిన్నారులు నీళ్లను చూసి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. ఒక్కోసారి ఇంట్లో చెప్పకుండా ఈత(Swimming)కు వెళ్తుంటారు. వారికి ఈత రాకున్నా కూడా నీటిలో దిగి స్నానాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈత రాక, లోతు తెలియక నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కావడం విద్యా సంస్థలకు సెలవులు. గ్రామాల్లో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల చెంతకు ఈత కొట్టాలని వెళ్తుంటారు. కొందరు సరదాగా ఈతకు వెళ్లి అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు(Swimming Precautions) తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ సమ్మర్ సేఫ్గా స్విమ్ చేయడానికి పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి చూద్దామా?
ఈతకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- పిల్లలు ఈత నేర్చుకోవాలంటే నిపుణులైన ఈతగాళ్ల సమక్షంలో లేదా తల్లిదండ్రులు పర్యవేక్షణలో నేర్పించాలి.
- ఈత నేర్చుకునేటప్పుడు నేరుగా నీటిలో దిగకుండా సేఫ్టీ జాకెట్, సేఫ్టీ రింగ్ ధరించి స్విమ్మింగ్ చేయాలి.
- మీకు ఈత వచ్చినా కూడా నీళ్లు ఎంత లోతు ఉన్నాయి? ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది ఈతకు వెళ్లే ముందు గమనించాలి.
- చెరువులు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. అక్కడి పరిస్థితి తెలుసుకోకుండా ఈత వచ్చిన అందులో దూకితే ప్రమాదాలు బారిన పడుతుంటారు.
- చెరువుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేయాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ బావుల దగ్గర సంబంధిత యజమానులు కంచెను ఏర్పాటు చేయాలి. ఎవరూ బావిలోకి దిగకుండా తగు చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలు :
- 2023 జనవరి 15న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు కోట్పల్లి ప్రాజెక్టుకు విహరించడానికి వెళ్లారు. ఈత రాక నీట మునిగి మృతి చెందారు.
- అలాగే 20233 ఆగస్టులో ఓ విద్యార్థి కూడా విహార యాత్రకు వెళ్లి అనంతగిరి పుష్కరణలో స్నానం చేస్తూ ఈత రాక మృతి చెందాడు.
- 2022 అక్టోబరులో ఈత రాక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికుమార్ బావిలో పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. తనకు ఈత రాకపోవడమే ఇందుకు కారణం.
- 2021లో హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు కోట్పల్లి ప్రాజెక్టుకు విహార యాత్రకు వెళ్లారు. వీరిలో ఓ యువకుడు నీటిలో మునిగి మృత్యువు పాలయ్యాడు.