Road Accident in Tirupati District :తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనకునుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతులు నెల్లూరు వనంతోపుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను నెల్లూరు తరలించినట్లు తెలిపారు. అరుణాచలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. వేగంగా ఢీకొట్టడంతో కంటెయినర్ లారీ కిందకు కారు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.