Negative Effects Of Social Media : పండగొచ్చినా, ఊరెళ్లినా, శుభకార్యం జరిగినా, అక్కసు వెళ్లబోసుకోవాలన్నా సోషల్ మీడియా వేదికల్లో పంచుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. కానీ పోస్టు చేసే ఫొటోలు, వీడియోలు కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నాయి. అటు బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తూ, ఇటు మనోవేదనకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలతో అప్రమత్తంగా ఉండాలి. యాప్‌ల వేదికగా జరుగుతున్న వేధింపులపై గతేడాది 151 కేసులు నమోదైతే, ఈ ఏడాది 9 నెలల కాలంలో రెట్టింపు ఫిర్యాదులు అందాయి.
ఐపీఎస్‌ల పేరుతో ఫేక్ అకౌంట్లు :డబ్బులు కావాలని ఫ్రెండ్ ఫోన్ వస్తే ఎవరైనా స్పందిస్తారు. అడిగినంత మొత్తం పంపిస్తారు. సైబర్ క్రైమ్‌ల తీరిది. ఓ ఐపీఎస్ అధికారిణి ఫొటోలతో 18 ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లు సృష్టించి పెద్దఎత్తున సొమ్ము కొట్టేసినట్టు కేసు నమోదైంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డీపీతో రూ.10 లక్షలు కొట్టేసిన నిందితుడిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వలపు వల విసిరి :సోషల్ మీడియా వేదికల్లో స్నేహితుల జాబితాలోని మహిళల ఫొటోలను సేకరించి డీపీగా ఉంచి అర్ధరాత్రి దాటాక వీడియో కాల్ చేస్తున్నారు. స్పందించిన వారితో నగ్నంగా సంభాషిస్తు వీడియోలను రికార్డు చేసి ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో ఉంచుతామంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల విశ్రాంత ఐఏఎస్‌ను ఇదే విధంగా భయపెట్టి డబ్బు డిమాండ్ చేశారు. మల్టీఫ్లెక్స్ యజమానికి కూడా వలపు వల విసిరారు.