KTR Comments On ACB Investigation : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని కేటీఆర్ మీడియాకు తెలిపారు. అధికారులకు అన్ని విధాలా సహకరించానని, విచారణకు ఎన్ని సార్లు పిలిచినా, హాజరవుతానని తెలిపారు. ఇదొక చెత్త కేసు అని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.
నాలుగు ప్రశ్నలనే 40 రకాలుగా ప్రశ్నించారు : నాలుగు ప్రశ్నలనే 40 రకాలుగా ప్రశ్నించారని ఎద్దేవా చేశారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదన్నారు. ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. పైసలు పంపాను అని తానే చెబుతున్నానని, ఆ డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. సాయంత్రం 5.15 సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించారు. ఈ విచారణను వేరే గది కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావు చూసేలా ఏర్పాట్లు చేశారు.
డీసీపీపై సీరియస్ : విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వెలుపల కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ విజయ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడితే మీకే నష్టమని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
"ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. రేవంత్‌రెడ్డి బలవంతంగా కేసు పెట్టించారని ఏసీబీ అధికారులకు కూడా అర్థమైంది. అవినీతి చేస్తే రేవంత్ రెడ్డే చేస్తారు. మేం చేయమని కుండబద్దలు కొట్టి చెప్పా. ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటామని చెప్పా. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాసమస్యలపై మాట్లాడుతూనే ఉంటాం. ఇదొక లొట్టపీసు కేసు అని మళ్లీ మళ్లీ చెబుతున్నా. అవినీతి ఎక్కడుందని అడుగుతుంటే అధికారులే నీళ్లు నముల్తున్నారు. పైసలు పంపాను.. అని నేనే చెబుతున్నాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని అడిగాను"- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ - సుమారు 7 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట - న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి