P Jayachandran Passed Away : 'అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది' పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్ పి. జయచంద్రన్ (80) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ త్రిశ్శూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. కేరళకు చెందిన జయచంద్రన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణ వార్త తెలియగానే పలు సినీ ఇండస్ట్రీల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగులో సూపర్ హిట్ పాటలు
ఆయన తెలుగులో పాడిన పలు పాటలు హిట్‌గా నిలిచాయి. హ్యాపీ హ్యపీ బర్త్‌డేలు (సుస్వాగతం), రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి) వంటి సాంగ్స్ విశేష ఆదరణ పొందాయి. తెలుగులో ఆయన పాడిన 'నా చెల్లి చంద్రమ్మ' (ఊరు మనదిరా) చివరి పాట 2002లో విడుదలైంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో 16 వేలకు పైగా పాటలు పాడారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎం.ఎం. కీరవాణి, విద్యా సాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో ఆయన ఎక్కువగా పాటలు పాడారు.
అవార్డులు
1986లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నేషనల్ అవార్డు (శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకుగానూ), 5 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా జయచంద్రన్‌ను వరించాయి. గాయకుడిగానే కాకుండా తెరపై కూడా జయచంద్రన్ కనిపించారు. మలయాళ సినిమాలు 'నఖక్ష తంగళ్', 'ట్రివేండ్రం లాడ్జ్' సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు.